"సినిమా" ఇది గ్లామర్ ఫీల్డ్. ప్రపంచవ్యాప్తంగా సినిమా అన్నా సినిమా వాళ్లన్న అంత క్రేజ్. మానవ జీవితంలో అదో భాగమైపోయింది. ఐతే లాక్ డౌన్ కారణంగా దాదాపు ఐదు నెలలుగా సినిమా థియేటర్స్ మూసుకుపోయాయి. జనానికి ఎంటర్ టైన్ మెంట్ కరువైపోయింది.
దాదాపు ఐదు నెలలు దాటేసింది సినిమా థియేటర్స్ మూసుకుపోయి. అలాగే లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగులు కూడా నిలిచిపోవడంతో దేశంలోని సినిమా పరిస్థితి మారిపోయింది. ఓ వైపు వినోదం అందక ప్రేక్షకుడు, మరోవైపు సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న సినీ పరిశ్రమతో అయోమయం ఏర్పడింది. ఓటీటీ పుణ్యమా అని కొత్త సినిమాలు విడుదలవుతున్నప్పటికీ పెద్ద తెరపై, డీటీఎస్ సౌండ్ తో చూసే మజానే వేరు అంటాడు సగటు ప్రేక్షకుడు.
దాదాపు ఐదు నెలల తర్వాత కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా షూటింగ్ లు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దాంతో నెమ్మదిగా చిత్రీకరణలు కొనసాగుతున్నాయి. కానీ సినిమా హాళ్లు మట్టుక తెరుచుకోలేదు. ప్రతీరోజు థియేటర్ కు వెళ్లి సినిమా చూసే వాళ్లున్నారు అంటే అతిశయోక్తిగా అనిపించినా, ఇది నిజం. అలాంటి వారు సినమా థియేటర్స్ ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నారు.
థియేటర్స్ మళ్లీ తెరవడానికి జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై నేడు ఢీల్లీలో ఓ కీలక వీడియో కాన్ఫరెన్స్ జరగనున్నట్లు సమాచరం. సినిమా హాళ్ల పునః ప్రారంభం తో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరపబోతున్నారు. దీనికి సంబంధించి టాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
24 గంటలకు పైగా ట్రెయిన్ లోని ఒకే బోగీలో సుదూరాలు ప్రయాణిస్తున్నప్పుడు రాని కరోనా రెండున్నర గంటల పాటు థియేటర్లో కూచోని చూస్తే వచ్చేస్తుందా..? అని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు. తగు జాగ్రత్తలు తీసుకుని కరోనా నిబంధనలు పాటిస్తే చాలని చాలమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ మీటింగ్ తరువాత సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దానిపై క్లారిటీ రావొచ్చని సినీ అభిమానులు అనుకుంటున్నారు.