'Fidaa' Completes 3 Years of Release: శేఖర్ కమ్ముల ఫిదాకి మూడేళ్ళు!
Fidaa Completes 3 Years of Release: చిన్న సినిమాలకి దైర్యం ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఆయన నుంచి ఓ సినిమా వస్తుంది అంటే యూత్ లో ఎప్పటికి ఓ మంచి క్రేజ్ అయితే ఉంటుంది
Fidaa Completes 3 Years of Release: చిన్న సినిమాలకి దైర్యం ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఆయన నుంచి ఓ సినిమా వస్తుంది అంటే యూత్ లో ఎప్పటికి ఓ మంచి క్రేజ్ అయితే ఉంటుంది. అయన అన్ని సినిమాలు ఓ మంచి కాఫీలాగే ఉంటాయి. అయితే కొంచం గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల 2017 జూలై 21న ఫిదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిజంగానే అందరిని ఫిదా చేశాడు. ఇప్పుడు ఆ అల్లరి ఫిదాకి నేటితో మూడేళ్ళు నిండిపోయాయి. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
శేఖర్ కమ్ముల ముందుగా ఈ సినిమాని మహేష్ బాబుతో చేద్దామని అనుకున్నాడట.. కానీ మహేష్ ఈ సబ్జెక్ట్ తనకి సూట్ అవ్వద్దని చెప్పడంతో కథ వరుణ్ తేజ్ కి వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమాకి ముందు సాయి పల్లవి మెడిసిన్ కోర్స్ చేస్తుంది. శేఖర్ కమ్ముల చెప్పిన కథ బాగా నచ్చి, ముఖ్యంగా భానుమతి పాత్రకి ఫిదా అయిపోయి ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పింది. ఇక కథగా చెప్పుకోడానికి ఫిదాలో కొత్తదనం అంటూ ఏమీ లేదు. కానీ సహజమైన పాత్రలు, భావోద్వేగాలు, అలకలు, కవ్వింతలు కేవలం ఇవే ప్రేక్షకుడి మనసుల్ని పిండేసి ఫిదా చేశాయి.
ఇక సాయి పల్లవి.. నిజంగా హైబ్రీడ్ పిల్లే..ఒకటే పీస్.. సినిమా చూస్తున్నంతసేపు పల్లెటూరి పిల్ల భానుమతి మాత్రమే కనిపిస్తుంది. తెలంగాణ పల్లెటూరికి పరికిణీ వేసినట్టుగా ఉంటుంది. బాన్సువాడలో ఆమె చేసే అల్లరి అంతఇంతా కాదు.. కొన్ని క్లోజప్ షాట్లలో ఆమె ముఖంపై మొటిమలతో ఎర్రగా కందిపోయిన బుగ్గలు కనిపిస్తాయి. కానీ ఆ భానుమతియే ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. స్వతహగా మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు తెలంగాణ స్లాంగ్ నేర్చుకొని మరి డబ్బింగ్ చెప్పి అందరిని ఫిదా చేసేసింది. వరుణ్ తేజ్ కూడా వరుణ్ పాత్రలో ఒదిగిపోయాడు. చాలా మేచుడ్ క్యారెక్టర్ ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు.
స్వచ్చమైన ప్రేమను చూసి ఎన్నిరోజులు అయింది అనుకుంటున్న ప్రేక్షకులకు ఆ లోటును ఈ సినిమా తీరుస్తుంది.. ఇద్దరికీ వేరు వేరు ప్రపంచాలు... ఇద్దరికీ వేరు వేరు కలలు.. ఇద్దరికీ ఒకరంటే ఒకరిని ప్రాణం .. కానీ ఆ ఇద్దరు కలవాలంటే ఎవరో ఒకరు తమ ప్రపంచాన్ని వదులుకోవాలి. ఆ మధ్యలో ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి. శక్తికాంత్ అందించిన సంగీతం సింప్లీ సుపర్బ్.. ఒక్కో పాట అద్భుతం. మూడేళ్ళు కాదు. ముప్పై ఏళ్ళు అయిన ఫిదాను ఎవరు మర్చుపోలేరు!