సుకుమార్ అందించిన కథ 18 పేజెస్ కి హైలైట్ గా నిలుస్తుందా?
*సుకుమార్ వల్ల "18 పేజెస్" సినిమాపై పెరుగుతున్న అంచనాలు
18 Pages: ఈ మధ్యనే యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ "కార్తికేయ 2" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఈ సినిమా మంచి ఆదరణను అందుకుంది. తాజాగా ఇప్పుడు నిఖిల్ "18 పేజెస్" అనే ఒక రొమాంటిక్ ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. "కార్తికేయ 2" సినిమాలో నిఖిల్ తో రొమాన్స్ చేసిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి కథను అందించారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం సుకుమార్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని అందించారని, కథలో ఒక యూనిక్ ప్లాట్ ఉంటుందని దానిని డైరెక్టర్ చాలా చక్కగా మరియు ఎంటర్టైనింగ్ విధానంలో చూపించారని వార్తలు వినిపిస్తున్నాయి. "కార్తికేయ 2" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ "18 పేజెస్" తో కూడా అంతే మంచి హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా హిందీలో కూడా డబ్ అయ్యి విడుదల కాబోతోంది. డిసెంబర్ 23న ఈ సినిమా థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ ను దేశవ్యాప్తంగా "అవతార్ 2" సినిమా తో పాటు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది "అవతార్ 2" సినిమా కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ట్రైలర్ ని లాంచ్ చేయడం సినిమాకి మరింత బజ్ ని తీసుకువస్తుందని చెప్పుకోవచ్చు.