Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభం

ఈడీ విచారణకు హాజరైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్

Update: 2021-08-31 06:45 GMT

డ్రగ్స్ కేసులో విచారణ మొదలు పెట్టిన ఈడీ (ఫైల్ ఇమేజ్)

Tollywood Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈసారి ఈ కేసును ఈడీ విచారణ చేస్తోంది. ఈరోజు నుంచి 12 మంది సినీ ప్రముఖులను విచారించనుంది. తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ఈడీ విచారణకు హాజరయయ్యారు. ఈ క్రమంలో ఉదయం 10గంటల తరువాత ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కారు దిగిన వెంటనే నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. ఈడీ సిబ్బంది ఆయనను కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం వరకు విచారణ కొనసాగే అవకాశం కనపడుతోంది.

విచారణ ఎలా కొనసాగనుంది, ఏయే ప్రశ్నలు అడగబోతున్నారు, పూరీ జగన్నాథ్ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అనే విషయాలు ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మరోవైపు హవాలా మార్గంలో విదేశాలకు డబ్బును తరలించి, అక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది నిజమైతే... మనీలాండరింగ్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది.

ఇవాళ్టి నుండి సెప్టెంబర్ 22 వరకు ఈడీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులను విచారించనున్నారు. సెప్టెంబర్‌ 2న నటి చార్మీ, సెప్టెంబర్‌ 6న హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. సెప్టెంబర్‌ 8న మరో స్టార్‌ యాక్టర్‌ రానా దగ్గుబాటి, సెప్టెంబర్‌ 9న హీరో రవితేజను ఈడీ ప్రశ్నించనుంది. సెప్టెంబర్‌ 13వ తేదీన నటుడు నవదీప్‌, ఎఫ్‌ క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ ఈడీ ముందు హాజరవుతారు. సెప్టెంబర్‌ 15వ తేదీనా ముమైఖాన్‌, సెప్టెంబర్‌ 17న నటుడు తనీష్‌, సెప్టెంబర్‌ 20న హీరో నందు, సెప్టెంబర్‌ 22న హీరో తరుణ్‌ను ఈడీ విచారించనుంది.

విదేశాలకు ఎలా నిధులను తరలించారనే విషయమై ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు. ఈ కేసును విచారించిన సిట్ అధికారి సోమవారం నాడు ఈడీ అధికారులతో భేటీ అయ్యారు. విచారణ నివేదికను ఈడీకి సమర్పించారు. ఎక్సైజ్ శాఖ విచారించిన 50 మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ కోసం పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లించినట్లుగా గుర్తించారు.

డ్రగ్స్ కొనుగోలు చేసి నిందితులకు హవాలా ద్వారా డబ్బులు తరలించారు. విదేశాలకు నిధులను ఎలా తరలించారనే విషయంపై ఈడీ విచారిస్తోంది. ఇప్పటికే సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించిన పెడర్స్ కెల్విన్, విక్టర్, కమింగాల స్టేట్‌మెంట్ సేకరించారు. విదేశీ బ్యాంకులకు ఎంత డబ్బు అక్రమంగా తరలిందనే విషయమై ఆరా తీస్తోంది. దీని కోసం ఇంటర్ పోల్ సాయం తీసుకొనే అవకాశం ఉంది.

Tags:    

Similar News