Double iSmart: ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఈస్మార్ట్.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా?
ఈ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్ నటించడంతో బాలీవుడ్‌లోనూ మంచి టాక్ వచ్చింది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు రామ్ కెరీర్‌ను, ఇటు పూరీ జగన్నాథ్ కెరీర్‌ను ఈ సినిమా మలుపు తిప్పింది. అప్పటి వరకు వరుస ప్లాఫ్‌లతో ఉన్న వీరిద్దరికీ మంచి విజయాన్ని అందించిందీ చిత్రం. 2019లో వచ్చిన ఈ చిత్రాన్ని సీక్వెల్‌గా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.
డబుల్ ఈస్మార్ట్ శంకర్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్ నటించడంతో బాలీవుడ్‌లోనూ మంచి టాక్ వచ్చింది. భారీ అంచనలా నడుమ ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన థియేటర్లలోకి విడుదల చేశారు. అయితే అంచనాలకు అనుగుణంగా మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ పార్ట్ స్థాయిలో సీక్వెల్ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా చిత్ర యూనిట్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ను మొదలు పెట్టేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాఫ్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో రామ్‌కు జోడిగా కావ్య థాపర్ నటించగా, సాయాజీ షిండే, గెటప్ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. బిగ్ బుల్ (సంజయ్‌దత్) విదేశాల్లో విలాసాలతో జీవిస్తూ చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. భారతదేశాన్ని ముక్కలు చేయాలనేది అతని కల. అతని కోసం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ వేట కొనసాగుతూ ఉంటుంది. అయితే బిగ్‌బుల్ బ్రెయిన్‌లో ఓ కణితి ఉందని వైద్యులు గుర్తిస్తారు. కొన్ని నెలలు మాత్రమే బతికే అవకాశాలు ఉంటాయని చెప్పడంతో. ఎలాగైనా బతకాలని అందుకోసం మార్గాలను అన్వేషిస్తుంటాడు. అయితే ఇదే సమయంలో మెదడులో చిప్ పెట్టుకుని జీవిస్తున్న ఇస్మార్ట్ శంకర్ గురించి తెలుస్తుంది. దీంతో బిగ్‌బుల్ జ్ఞాపకాలను కాపీ చేసి ఇస్మార్ట్ శంకర్ మెదడులోని చిప్‌లో ఇన్‌సెర్ట్ చేస్తారు. ఆ ర్వాత ఏం జరిగిందన్నదే సినిమా కథ.