Rajamouli On Plasma Donation : కరోనాని నిర్లక్ష్యం చేయొద్దు : ఎస్ఎస్ రాజమౌళి
Rajamouli On Plasma Donation : దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన
Rajamouli On Plasma Donation : దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.. అందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.. అయనతో పాటుగా అయన కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. అదృష్టవశాత్తు తాజాగా అయన కుటుంబం కరోనా నుంచి బయటపడింది. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తానని రాజమౌళి ట్వీట్ చేశారు.
తాజాగా ప్లాస్మా దానంపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన అవగాహన సదస్సుకి దర్శకుడు రాజమౌళితో పాటుగా సంగీత దర్శకుడు కీరవాణి, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ...కరోనా విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని కోరారు రాజమౌళి.. సకాలంలో కరోనాను గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వైద్యుల సూచన మేరకు పలు జాగ్రత్తలు పాటిస్తూ సరైనా పౌష్ఠికాహారం తీసుకుంటే కరోనాని జయించవచ్చన్నారు. ఇక ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దని సూచించారు.
ఇక ఇదే కార్యక్రమంలో సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవిని అని, దీనిపైన అపోహలు, అనుమానాలు వద్దని అన్నారు. ఇక ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తూ కీరవాణి రూపొందించిన ఓ పాటను సీపీ సజ్జనార్ విడుదల చేసి రాజమౌళి, కీరవాణిని సత్కరించారు.
ప్రస్తుతం రాజమౌళి RRR అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.