Tollywood: డ్రగ్స్ కేసులో నేడు విచారణకు హాజరుకానున్న పూరీ జగన్నాథ్

* మొత్తం 62 మందిని విచారించనున్న ఈడీ * నటీనటుల విచారణ తరువాత మరికొందరిపై దృష్టిపెట్టిన ఈడీ

Update: 2021-08-31 04:46 GMT

 ఈడీ విచారణకు హాజరుకానున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (ఫైల్ ఫోటో)

Tollywood Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈసారి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసును విచారిస్తోంది. ఇవాళ్టి నుంచి డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం కానుంది. నేడు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఆ తర్వాత రోజుల్లో మిగతా నటీనటులను కూడా విచారించనుంది. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపించింది. మరో 50 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ 50 మందిని కూడా గతంలో ఎక్సైజ్ అధికారులు విచారించారు.

డ్రగ్స్ కేసుకు సంబంధించి 'సిట్' ఆఫీసర్ శ్రీనివాస్ నుంచి ఈడీ సోమవారం కెల్విన్‌తో పాటు మరో ఏడుగురు నిందితుల వివరాలను తీసుకుంది. కెల్విన్ అరెస్ట్, సీజర్ డ్రగ్స్, చార్జ్‌షీట్ ఫైలింగ్ వరకు వివరాలను రికార్డ్ చేసింది. అటు సెలబ్రిటీల విచారణ కోసం సెప్టెంబర్ 22 వరకు ఈడీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసులో నేటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల టీం ప్రశ్నించనున్నారు. నేడు పూరి జగన్నాథ్‌ను విచారించనుంది. టాలీవుడ్ నటీనటుల విచారణ తరువాత మరికొందరిపై ఈడీ దృష్టి పెట్టనుంది. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులు విచారించిన 50 మందికి ఈడి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ కేసులో మొత్తం 62 మందిని విచారించాలని ఈడీ ప్లాన్ సిద్ధం చేసింది. డ్రగ్స్ కేసులో హవాలా మనీలాండరింగ్ ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా ఈడి గుర్తించింది. డ్రగ్స్ కోసం పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లీంచ్చినట్లుగా గుర్తించిన ఈడీ డ్రగ్స్ కొనుగోలు చేసి నిందితులకు హవాలా ద్వారా డబ్బులు కూడా తరలించినట్లు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు ద్వారా విదేశాలకు ఎంత డబ్బు మళ్లించారు.. అదంతా ఎక్కడిది వంటి అంశాలపై ఈడీ విచారణ జరుపనుంది. డ్రగ్స్ పెడ్లర్లు పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఈడీ ఆఫీస్ ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News