Theatres Reopen in Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి థియేటర్లు ఓపెన్

* ఏపీలో రేపటి నుంచి తెరుచుకోనున్న సినిమా హాళ్లు * 50శాతం ప్రేక్షకులతో అనుమతిచ్చిన ప్రభుత్వం

Update: 2021-07-30 03:27 GMT

థియేటర్స్ ఓపెన్ (ఫైల్ ఫోటో)

Theatres Reopen in Telangana: తెలుగు రాష్ట్రాల సినిమా ప్రేక్షకులకు మంచి రోజులు వచ్చేశాయి. ఎప్పుడెప్పుడు సినిమా హాళ్లో మూవీ చూద్దామా.. థియేటర్‌ బయట సందడి చేద్దామా.. ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేద్దామా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు ఆ సమయం ఆసన్నమైంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి థియేటర్లు తెరుచుకోనుండగా ఏపీలో మాత్రం ఒకరోజు ఆలస్యంగా రేపటి నుంచి సినిమా హాళ్లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్‌ ఇవ్వగా తెలంగాణలో మాత్రం పూర్తిస్థాయి ప్రేక్షకులతో ప్రదర్శనలు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది.

తెలుగు సినీ పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. లాక్‌డౌన్‌తో సినిమా రంగం చిన్నాభిన్నం అయింది. దాదాపు ఏడాదిన్నర కాలం.. షూటింగ్‌లు లేక ఎంతోమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అటు థియేటర్లు మూతపడటంతో యజమానులు, సిబ్బంది తీవ్రస్థాయిలో నష్టపోయారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 17 వందలకు పైగా థియేటర్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 34వేల మంది ప్రత్యక్షంగా, మరో 10వేల మంది పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కరోనాతో వారంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు దాపరించాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా అదుపులోకి రావడంతో పలు నిబంధనలతో సినిమా హాళ్లను తెరుచుకోవడానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. తెలంగాణలో 100శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శనలు చేసుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం.. సింగిల్‌ స్క్రీన్‌లలో పార్కింగ్‌ రుసుం వసూలుకు అనుమతిచ్చింది. దీంతో తెలంగాణలో థియేటర్లు మళ్లీ యథావిధిగా తెరిచేందుకు యజమానులు సిద్ధమయ్యారు.

అటు ఏపీలో టికెట్‌ ధరలపై ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై కొంత అసంతృప్తి ఉంది. లాక్‌డౌన్‌ నిబంధనలు, టికెట్ల ధరల విషయంలో యాజమాన్యాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. 50శాతం ప్రేక్షకులతో, ఆ ధరలతో ఏసీ థియేటర్లు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రాత్రి 10 తర్వాత కర్ఫ్యూ అమలు నేపథ్యంలో సెకండ్‌ షో నిర్వహణ కష్టసాధ్యమని, దీంతో థియేటర్లలో మూడు ఆటలే ఆడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కారణాల వల్ల రాష్ట్రంలోని కొన్నిచోట్ల థియేటర్లను తెరిచేందుకు కొందరు యజమానులు ముందుకు రావడం లేదు.

మొత్తానికి సినిమా ప్రేక్షకులకు రెండు రాష్ట్రాల్లో థియేటర్ల అందుబాటులోకి వచ్చాయి. ఇవాళే బొమ్మ కూడా పడనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ రెండు సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జ నటిస్తున్న చిత్రం ఇష్క్‌. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఎస్‌ఎస్‌ రాజు దర్శకత్వంలో ఆర్‌బీ చౌదరి సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్‌, పరాస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అలాంటి తెలివితేటలున్న లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌ నటించిన చిత్రం తిమ్మరుసు. ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్‌. ఈ సినిమా కూడా ఇవాళ ప్రేక్షకులను అలరించనుంది.

Tags:    

Similar News