'మా' పదవికి మెగాస్టార్ రాంరాం!
MAA Association: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) క్రమశిక్షణ సంఘం పదవికి మెగాస్టార్ చిరంజీవి రాజీనామా చేసినట్టు సమాచారం.
MAA Association: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) క్రమశిక్షణ సంఘం పదవికి మెగాస్టార్ చిరంజీవి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. తొలుత 2019లో సీనియర్ నరేశ్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. ఆపై కొంత కాలానికి మా కార్యనిర్వాహక సభ్యులు రెండుగా విడిపోగా, కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధలు సభ్యులుగా మరో క్రమశిక్షణా సంఘం ఏర్పాటైంది.
తనపై ఆ సంఘం చర్యలు తీసుకుంటుందని గ్రహించిన రాజశేఖర్ ముందే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. దాంతో 'మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ... నరేశ్ వర్గంగా, జీవిత వర్గంగా చీలిపోయింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలను ఎక్కుపెట్టాయి. కొద్ది రోజులు నరేశ్ 'మా' అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటే, ఉపాధ్యక్షుడిగా ఉన్న బెనర్జీ ఆ స్థానంలో విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాల మధ్య సఖ్యత ఏర్పడక ముందే కరోనా వచ్చేసింది. దాంతో 'మా' సభ్యులందరినీ చూసుకునే పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే అదే సమయంలో చిరంజీవి చొరవ చూపి, 'కరోనా ఛారిటీ కమిటీ' పేరుతో 'మా'తో పాటు మిగిలిన ఫిల్మ్ అసోసియేషన్ సభ్యులనూ ఆదుకునే పనిచేశారు.
మాలో విభేదాలు తొలగకముందే కరోనా వెలుగులోకి రాగా, అప్పటి నుంచి అన్ని రకాల సినిమా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కొవిడ్ ప్రభావం నుంచి బయట పడుతోంది. మరోవైపు మా తదుపరి ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే చిరంజీవి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.