Chiranjeevi Most Emotional Video on SP Balu: తెలుగు సినిమాకు అమృత గళం బాలు: మెగాస్టార్ చిరంజీవి.
Chiranjeevi Most Emotional Video on SP Balu: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
Chiranjeevi Most Emotional Video on SP Balu: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై భిన్న కథనాలు రావడంతో సంగీత ప్రియులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. బాలు త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలని ఎంతో మంది సినీ ప్రముఖులు ఆ దేవుడిని ప్రార్థించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం .. ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందనీ, ఆయనకు వెంటిలేటర్‌ను తొలగించారని చెల్లెలు ఎస్పీ శైలజ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని అన్నారు.
ఈ క్రమంలో బాలు ఆరోగ్యం మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. బాలు ఆరోగ్యం మెరుగు పడుతుండటం పై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. బాలు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు తెలిపారు. అలాగే వారి మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఒక వీడియో మెసేజ్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
''కోట్లాది మంది అభిమాన గాయకుడు, దేశం గర్వించే అత్యుత్తమ కళాకారుడు, నా సోదర సమానుడు శ్రీ ఎస్పీ బాలు రోజురోజుకీ కోలుకుంటున్నారని.. వైద్యానికి మెరుగ్గా స్పందిస్తున్నారని విని నేను చాలా సంతోషిస్తున్నా. ఆ సంతోషాన్ని పంచుకోవాలనే ఇలా మీ ముందుకు వచ్చాను. బాలుతో నాకు సినిమా పరమైన అనుబంధమే కాదు.. కుటుంబ పరంగా కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది. చెన్నైలో పక్క పక్క వీధుల్లో ఉంటూ తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్లం. ఎన్నో సంవత్సరాల వ్యక్తిగత అనుబంధం మాది.
తనని నేను అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటాను. అలాగే, ఆయన చెల్లెళ్లు ఎస్పీ వసంత, ఎస్పీ శైలజలు కూడా నన్ను అన్నయ్యలాగే చూసుకుంటూ ఉంటారు. బాలు ఆరోగ్య పరిస్థితిని గత మూడు రోజులుగా వసంత, శైలజ, శుభలేఖ సుధాకర్‌తో మాట్లాడి తెలుసుకుంటూనే ఉన్నాను. ఈరోజు కూడా తన ఆరోగ్యం గురించి వాళ్లతో మాట్లాడాను. బాలు ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు చెప్పిన మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలుగ చేశాయి. రోజురోజుకి ఆరోగ్యం మెరుగవుతుందనే మాటలు నాకు చాలా సంతోషనిచ్చాయి.
బాలు తెలుగు సినిమాకు అమృత గళం. ఆ మాటకొస్తే.. భారతీయ సినిమాకు ఆయన ఊపిరే రాగం, తాళం, పల్లవి. త్వరగా కోలుకొని ఆ గళం విప్పాలని.. కోటి రాగాలు తీయాలని.. భారతీయులందరినీ ఉర్రూతలూగించాలని, అలరించాలని ఆయనకున్న కోట్లాది మంది అభిమానులతో పాటు నేనూ ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. త్వరగా బాలు మన ముందుకు వచ్చి రెట్టించిన ఉత్సాహంతో మునుపటికంటే మరింతగా వినోదం పంచాలని, అలరించాలని, ఆహ్లాదపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కోసం మనందరం కలిసి ఆ భగవంతుడిని వేడుకుందాం'' అని చిరంజీవి అన్నారు.
GET WELL SOON #SPB garu! pic.twitter.com/5AV9mf7pEw
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 18, 2020