Chiranjeevi Childhood Memory: ఆరోజు నాన్న బాగా కొట్టాడు.. చిరంజీవిని ఇప్పటికీ వెంటాడే చేదుజ్ఞాపకం

Update: 2024-08-21 16:35 GMT

Chiranjeevi Childhood Memory: ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా.. ఏ స్థాయికి వెళ్లినా.. వారి బాల్యంలోకి తొంగిచూస్తే ఏవో కొన్ని మధుర స్మృతులు, ఇంకొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి బాల్య జీవితంలోనూ ఆయన్ని ఎప్పటికీ వెంటాడే కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. చిరంజీవి చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన తాలుకా జ్ఞాపకాలు ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతుంటాయట.

అదేంటంటే.. అప్పుడు చిరంజీవికి 13 ఏళ్లు.. ఒకసారి తన తండ్రి సినిమాకు వెళ్లారని తెలిసి అదే సినిమాకు చిరంజీవి తన తమ్ముడు నాగబాబుని తీసుకుని వెళ్లారు. అసలే అది ఓ పెద్ద హీరో సినిమా. అది కూడా సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో కావడంతో అప్పటికే సినిమా థియేటర్ వద్ద అభిమానుల సందడితో విపరీతమైన రద్దీ. ఎలాగోలా నేల టికెట్ తీసుకుని సినిమా చూశారు. కానీ తనకు తెలియకుండా పిల్లలు కూడా అదే సినిమాకు వచ్చారని ఎలా తెలుసుకున్నారో కానీ మొత్తానికి చిరంజీవి వాళ్ల నాన్న కొనిదెల వెంకట రావుకు కూడా ఆ విషయం తెలిసిపోయింది.

అప్పట్లో సినిమా స్క్రీన్స్ సమీపంలో సినిమా విడుదలను సెలబ్రేట్ చేసుకునే సంస్కృతిలో భాగంగా స్క్రీన్‌కి ఇరువైపులా రాడ్లకు కొబ్బరిమట్టలు కట్టేవారు. అప్పటికే అసలు విషయం తెలిసి ఆగ్రహంతో ఊగిపోతున్న చిరంజీవి వాళ్ల నాన్న.. అక్కడే ఉన్న కొబ్బరిమట్టను చీల్చి చిరంజీవికి కోటింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారట.

చిరంజీవి వాళ్ల నాన్నకు అంత కోపం రావడానికి కారణం ఏంటంటే.. అప్పటికి చిరంజీవి వయస్సే కేవలం 13 ఏళ్లు. మరి తమ్ముడు నాగబాబు ఇంకెంత చిన్న వయస్సు అయి ఉంటారో అర్థం చేసుకోండి. సరిగ్గా ఆ విషయంలోనే చిరంజీవి వాళ్ల నాన్నకు కోపం కట్టలు తెంచుకుందట. చిన్నపిల్లాడిని వెంటేసుకుని థియేటర్ కి వచ్చావు.. ఈ జనం తొక్కిసలాటలో వాడు చచ్చిపోతే పరిస్థితి ఏంటి అని మండిపడ్డారట. ఆ కోపంతోనే చిరంజీవిని కనకమహల్ నుండి మూలపేట వరకు రోడ్డుపై కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకువెళ్లారట.

ఇది కూడా చదవండి : Chiranjeevi Aggressive Speech: చిరంజీవికి బాగా కోపం తెప్పించిన సందర్భం ఏదో తెలుసా ?

ఇంతకీ చిరంజీవి అంత దెబ్బలు తిని మరీ చూసిన ఆ సినిమా ఏంటనే కదా మీ సందేహం.. యస్ అక్కడికే వస్తున్నాం... అది నందమూరి తారక రామారావు నటించిన రాము అనే చిత్రం. ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. " ఇప్పటికీ ఏవీఎం రాము అనే సినిమా పేరెత్తితే చాలు.. ఒంట్లో వణుకు పుడుతుంది " అని స్వయంగా చిరంజీవినే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. " నాన్న గారికి ఆవేశం వస్తే ఆగేది కాదని.. ఆరోజు అలా దెబ్బలు తిన్నాం. ఫస్ట్ డే.. ఫస్ట్ షో విషయంలో అది నాకు ఎదురైన అనుభవం " అని చిరంజీవి తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ఏంటి.. మీకు కూడా మీ బాల్యంలో ఎదురైన ఇలాంటి అనుభవం ఏదైనా గుర్తుకొచ్చిందా !! ఐతే కామెంట్స్ రూపంలో మీ అనుభవాన్ని షేర్ చేసుకోండి. 

ఇది కూడా చదవండి : Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే.. రీరిలీజ్‌కు సిద్ధమైన ఆ మూవీ..!

Tags:    

Similar News