Chiranjeevi Angry Speech: చిరంజీవికి బాగా కోపం తెప్పించిన సందర్భం ఏదో తెలుసా ?

Chiranjeevi Angry Speech: ఆగస్టు 22 టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా చిరుకు హ్యాపీ బర్త్‌డే చెబుతూ ఆయన జీవితంలోంచి కొన్ని జ్ఞాపకాలు

Update: 2024-08-21 14:44 GMT

Chiranjeevi Angry Speech: మెగాస్టార్ చిరంజీవి చాలా కూల్‌గా, సింపుల్‌గా ఉంటారు. సర్వసాధారణంగా ఆయన ఎవ్వరిపైనా కోప్పడటం అనేది ఎవ్వరూ పెద్దగా చూసి ఉండరు. మరీ ముఖ్యంగా ఓ దశాబ్ధ కాలంలో అటువంటి రియల్ సీన్ ఏదీ కనిపించలేదు. ఎందుకంటే మెగాస్టార్ వీలైనంత వరకు నవ్వుతూనే మాట్లాడతారు. ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూల్లో కానీ లేదా నలుగురి మధ్యలో ఉన్నప్పుడు అయినా చిరంజీవిని ఎవ్వరైనా, ఏదైనా ఇబ్బందికరమైన ప్రశ్న అడిగినా.. చిరు మాత్రం వారిపై పెద్దగా విసుక్కోకుండా చిరునవ్వుతోనే సమాధానం చెప్పి తప్పుకుంటుంటారు. చిరంజీవి గురించి బాగా తెలిసిన చాలామంది అభిప్రాయం ఇదే.

అయితే, ఎప్పుడూ అంత కూల్‌గా ఉండే చిరంజీవి మొన్నామధ్య ఒక అంశంపై ఒకింత ఆవేశంతో మాట్లాడారు. అదేంటంటే.. సినీ హీరోల పారితోషికం గురించి. ఔను... సినిమా వాళ్ల సంపాదన లెక్కలు మీకెందుకయ్యా అంటూ ఏపీలోని గత సర్కారులో ఉన్న కొంతమంది పెద్దలపై ఆయన స్వరం పెంచి మాట్లాడారు. సినిమా వాళ్లు ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావు.. సినిమాలు సక్సెస్ అయినప్పుడు నిర్మాతలకు డబ్బులు వస్తున్నాయి కనుకే సినిమా కోసం కష్టపడిన వాళ్లకు ఆ డబ్బులు ఇస్తున్నారు. అంతేకాకుండా సినీ రంగం వల్ల హీరోలే కాదు.. కళామతల్లిని నమ్ముకున్న వాళ్లు ఎందరికో ఉపాధి దొరుకుతోంది. సినీ ఇండస్ట్రీ ఎంతో మందికి బతుకుదెరువు అందిస్తోంది. అవన్నీ పట్టించుకోకుండా సినిమా హీరోలు భారీగా పారితోషికం అందుకుంటున్నారని మాపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అని మండిపడ్డారు. అంతేకాదు.. ఇదేదో పెద్ద విషయం అన్నట్లుగా చివరకు ఈ అంశంపై పార్లమెంట్‌లో కూడా లేవనెత్తుతున్నారు అని చిరంజీవి చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులతో పోల్చుకుంటే సినిమా ప్రపంచం చాలా చిన్నది అని చిరంజీవి పరోక్షంగానే రాజకీయ నాయకుల సంపాదనపై వేలెత్తి చూపించారు.

ఏడాది క్రితం వాల్తేరు వీరయ్య సినిమా ఫంక్షన్‌లో చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి. ఎందుకంటే... సినిమా వాళ్ల పారితోషికం గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించింది ఇంకెవరో కాదు... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డినే. సినిమా వాళ్లు భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటూ ఆ సంపాదన లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్నారు అనే కోణంలో విజయసాయి రెడ్డి మాట్లాడారు. "అది కూడా తమ ప్రతిపక్షంతో చేతులు కలిపి తమని రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తోన్న జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని.. అందుకే విజయసాయి రెడ్డి మాటలు చిరంజీవికి అంత కోపం తెప్పించాయి" అని సినీ, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

విజయసాయి రెడ్డి మాత్రమే కాదు.. అప్పట్లో ఏపీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు సైతం ఈ అంశంపై మాట్లాడారు. సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ కూడా నటించారు. అయితే, ఈ బ్రో మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటూ ఆ సినిమా నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ని ప్రశ్నించారు. అలా అంబటి రాంబాబు వ్యాఖ్యలను కూడా దృష్టిలో పెట్టుకునే చిరంజీవి ఏపీ సర్కారుపై అంత ఫైర్ అయ్యారు అనే టాక్ బలంగా వినిపించింది.

చిరంజీవి ఘాటుగా మాట్లాడిన తీరుపై అప్పటి ఏపీ సర్కారులోని వైసీపీ నేతలు కూడా అంతే ఘాటుగా స్పందించారు. పేర్ని నాని, కొడాలి నాని వంటి నేతలు ప్రెస్‌మీట్స్ పెట్టి మరీ చిరు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సినిమా వాళ్లు రాజకీయ నాయకులను గిల్లినప్పుడు మేం తిరిగి గిల్లకుండా ఎలా ఉండగలం అని వారు బదులిచ్చారు. అంతేకాదు.. ఠాగూర్ లాంటి సినిమాలతో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే సందేశం ఇచ్చిన చిరంజీవికి... రెమ్యునరేషన్ లెక్కలు అడిగితే ఎందుకు అంత కోపం వస్తోంది అంటూ వైసీపీ నేతలు ఎందురు ప్రశ్నలు సంధించారు. దీంతో ఈ అంశంపై కొన్నాళ్ల వరకు వైసీపీ vs మెగా ఫ్యాన్స్ పెద్ద రచ్చే నడిచింది.

ఏదేమైనా చిరంజీవి క్రియాశీల రాజకీయ నుండి పక్కకు తప్పుకున్నాకా.. సినిమా వాళ్ల కోణంలోంచి రాజకీయ నాయకులపై అంత కోపంగా రియాక్ట్ అవడం అనేది ఇదే మొదటిసారి అనే భావన చాలామంది రాజకీయ పరిశీలకులలోనూ కనపడింది. 

Tags:    

Similar News