Nayanthara: నయనతారకు నోటీసులు.. స్పందించిన చంద్రముఖి నిర్మాతలు

Update: 2025-01-07 09:03 GMT

Chandramukhi movie producers: హీరోయిన్‌ నయనతారకు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని చంద్రముఖి సినిమా నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. తాము రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. నయనతార జీవితంపై బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ విడుదలైన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది రిలీజైనప్పటి నుంచి నయనతార నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇందులో చంద్రముఖిలోని కొన్ని సన్నివేశాలు ఉపయోగించడంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై ఆ సినిమా నిర్మాతలు స్పందించారు.

నయనతార తన డాక్యుమెంటరీ కోసం ముందే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆ సర్టిఫికెట్‌ను షేర్ చేశారు. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ తెరకెక్కించే ముందే మా వద్ద నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నారని తెలిపారు. డాక్యుమెంటరీలో చంద్రముఖిలోని సన్నివేశాలను ఉపయోగించడంపై మేము ఎలాంటి నోటీసులు పంపలేదని చెప్పారు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రముఖి నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ పేర్కొంది. అలాగే రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చింది.

ఇక నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్‌లో తన పర్మిషన్ తీసుకోకుండా నానుమ్ రౌడీ దాన్ ఫుటేజ్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాత, హీరో ధనుష్ గతంలో హీరోయిన్ నయనతారకు నోటీసులు పంపించారు. మూడు సెకన్ల క్లిప్‌నకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నయనతార ధనుష్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. నోటీసులు పంపినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సన్నివేశాలు ఉపయోగించడంపై ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 8వ తేదీ లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నయనతార దంపతులతో పాటు నెట్ ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది.

ఇక్కడ విషయం ఏమిటంటే తన డాక్యుమెంటరీలో కొన్ని సినిమాల్లోని సీన్స్ వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ నయనతార కొన్ని రోజుల క్రితం ఓ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో చంద్రముఖి నిర్మాణ సంస్థ పేరు కూడా ఉంది. అయితే తాజాగా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు రావడంతో చంద్రముఖి నిర్మాతలు దీనిపై క్లారిటీ ఇచ్చారు. 

Tags:    

Similar News