Indian movies in Oscar race: ఆస్కార్ బరిలో ఆరు భారతీయ చిత్రాలు
Indian movies in Oscar race: ఆస్కార్ బరిలో ఇండియా నుంచి ప్రస్తుతం ఆడు జీవితం (మళయాలం), కంగువా, సంతోష్ (హిందీ), స్వతంత్ర్య వీర సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (హిందీ) సినిమాలు నిలిచాయి.
Indian movies in 97th Academy Awards race: ప్రపంచ వ్యాప్తంగా సినీ నటులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు పొందాలని కలలు కంటారు. గతేడాది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఒక దక్షిణాది చిత్రం ఆస్కార్ గెలిచి.. భారత ఖ్యాతిని పెంచేసింది. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా 97వ అవార్డ్స్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో అనేక దేశాల నుంచి ఎన్నో విభాగాల్లో పలు చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే మన దేశంలో ఆరు సినిమాలు మాత్రం ఎలిజిబుల్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.
97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్‌కు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కార్‌కు అర్హత సాధించిన 323 చలన చిత్రాల జాబితాను వెల్లడించింది. వీటిలో 207 చిత్రాలు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచాయి. ఇక పోటీలో నిలిచిన వాటిలో ఆరు భారతీయ చిత్రాలు కూడా ఉన్నాయి.
97వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్లకు అర్హత సాధించిన సినిమాల జాబితాను అకాడమీ సంస్థ జనవరి 7న విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళ చిత్రం కంగువ కూడా నిలిచింది. మరో రెండు నెలల్లో ఆస్కార్ అవార్డ్స్ ప్రదాన వేడుక అట్టహాసంగా జరగనుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ఆడు జీవితం (మళయాలం), కంగువా, సంతోష్ (హిందీ), స్వతంత్ర్య వీర సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (హిందీ) సినిమాలు నిలిచాయి.
కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన లాపతా లేడీస్ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచింది. కానీ అది షార్ట్ లిస్ట్ మాత్రం అవ్వలేకపోయింది. సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు ఆస్కార్ అవార్డ్ గెలవడం మాత్రమే కాదు ఆస్కార్ బరిలో నిలవడం కూడా గొప్ప విషయమే. వెయ్యేళ్ల కిందట ఆది మానవుల టైమ్ నుంచి ఐదు తెగల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన కంగువ వెండి తెరపై నిరాశపరిచింది.
నటన పరంగా సూర్యకు నూటికి నూరు మార్కులు పడినప్పటికీ కంగువ సినిమా కథ, కథనం ఆకట్టుకోలేకపోయాయి. సూర్య హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ కంగువ. దిశా పటానీ హీరోయిన్‌గా నటించగా.. బాబీడియోల్ విలన్ పాత్ర పోషించాడు. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.
2024 నవంబర్ 14న పాన్ ఇండియా వైడ్‌గా కంగువా విడుదలైంది. అయితే డిజాస్టర్‌గా నిలిచిన సూర్య కంగువ సినిమా ఆస్కార్ బరిలో నిలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేవీశ్రీప్రసాద్ పాటలు, ఆటవిక ప్రాంతాన్ని డీఓపీ చూపించిన విధానం ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాత్రలు మాట్లాడడానికి బదులు బిగ్గరగా అరుస్తున్నాయనే విమర్శలను కంగువ మూటగట్టుకుంది. విజువల్స్, సినిమాటోగ్రఫీ వల్ల కంగువ సినిమా ఆస్కార్ నామినేషన్ల బరిలో నిలిచి ఉండొచ్చనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరికొందరు డిజాస్టర్‌గా నిలిచిన కంగువా ఆస్కార్ బరిలో ఉండడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక నామినేషన్ల కోసం ఓటింగ్ జనవరి 8న ప్రారంభమవుతుంది. జనవరి 12న ముగుస్తుంది. అకాడమీ తుది నామినేషన్‌లను జనవరి 17న ప్రకటించనుంది. దీంతో ఈ ఐదు సినిమాల్లో ఏదైనా ఒకదానికైనా నామినేషన్ దక్కుతుందా అని భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ 2025 వేడుక మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది.