Oscar 2023: నాటునాటుకు ఆస్కార్.. ప్రముఖుల ప్రశంసలు
Oscar 2023: నాటునాటుకు ఆస్కార్.. ప్రముఖుల ప్రశంసలు
Oscar 2023: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఆస్కార్' (Oscars 2023) అవార్డు ఈ ఏడాది 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR)లోని 'నాటు నాటు' (Naatu Naatu) (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి) పాటకు రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నాటి కల నేడు సాకారమైందన్నారు. ఈ మేరకు 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్‌ను ప్రశంసిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.
''విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. 'నాటు నాటు' పాట తెలంగాణ సంస్కృతి.. తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శం. తెలుగు మట్టి వాసనలను వెలుగులోకి తీసుకువచ్చిన చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, చిత్ర దర్శకుడు రాజమౌళి, నటీనటులందరికీ అభినందనలు'' - కేసీఆర్
''భారతీయ జెండా రెపరెపలాడుతోంది!! తెలుగు పాట అవార్డు అందుకోవడం పట్ల ఎంతో గర్విస్తున్నా. అంతర్జాతీయ వేదికపై మన జానపదం ఇంతటి గుర్తింపు సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్‌కు నా అభినందనలు'' - జగన్
''అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అవార్డును దక్కించుకుని 'నాటు నాటు' ఖ్యాతి గడించింది. భారతీయ చిత్రానికి గర్వించే క్షణాలు ఇవి. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రామ్‌చరణ్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్‌లకు కంగ్రాట్స్'' - చంద్రబాబు నాయుడు
''నాటు నాటు' ప్రపంచ ఖ్యాతి సొంతం చేసుకుంది!! ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును దక్కించుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ సభ్యులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు. 'ఆస్కార్' అనేది ఇప్పటివరకూ భారత్‌కు ఒక కలగా ఉండేది. కానీ, రాజమౌళి విజన్, ధైర్యం, నమ్మకం మనకు అవార్డు వచ్చేలా చేసింది. కోట్లాది భారతీయుల హృదయాలు గర్వం, సంతోషంతో నిండిన క్షణాలివి'' - చిరంజీవి
''భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న 'ఆర్ఆర్ఆర్' చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌కు హృదయపూర్వక అభినందనలు. ఈ వార్త విని ఎంతో సంతోషించాను. ఆస్కార్ 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్'గా నిలిచిన 'నాటు నాటు' ప్రపంచం నలువైపులా ప్రతి ఒక్కరితో డ్యాన్స్ చేయించింది. ప్రతిష్ఠాత్మక స్టేజ్‌పై పాటను ఆలపించడం.. అవార్డును అందుకోవడంతో భారతీయ సినిమా ఖ్యాతి మరోస్థాయికి చేరింది. ఇంతటి ఘనత సొంతమయ్యేలా చేసిన దర్శకుడు రాజమౌళి, నటులు రామ్‌చరణ్, ఎన్టీఆర్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, నిర్మాత డీవీవీ దానయ్య ఇతర బృందానికి నా అభినందనలు'' - పవన్‌కల్యాణ్
''వావ్!! భారతదేశం గర్వించే చరిత్రాత్మక క్షణాలివి. అందరి నమ్మకాలను నిజం చేస్తూ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ మొత్తానికి నా అభినందనలు'' - లోకేశ్
''చరిత్ర సృష్టించాం. భారతీయలందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు'' - రవితేజ