Anant Radhika Wedding: అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్.. తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్..
Anant Radhika Wedding: రెండో రోజు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ పాల్గొన్న సెలబ్రెటీలు
Anant Radhika Wedding: భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో అంబరాన్నంటుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. గ్రామీ అవార్డు విన్నింగ్ సింగర్ రిహన్నా ప్రదర్శనతో ఈ వేడుక ప్రారంభమైంది. ఈ షో కోసం ఆమెకు ఏకంగా 9 మిలియన్ డాలర్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ మూడు రోజుల వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం అంబానీ కుటుంబం ఖరీదైన సేవలు అందిస్తోంది. ముంబై, ఢిల్లీ నుంచి జామ్‌నగర్‌కు చార్టెడ్ విమానాలు నడుపుతోంది. వరల్డ్ క్లాస్ చెఫ్‌లు, వార్డ్‌రోబ్ సర్వీసులతోపాటు అతిథులను తరలించేందుకు లగ్జరీ కార్లు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. వారికి విభిన్న రుచులు అందించేందుకు ఇండోర్‌లోని జర్దిన్ హోటల్ నుంచి 21 మంది చెఫ్‌లను రప్పించారు. వారు సిద్ధం చేయబోయే వంటకాల్లో జపనీస్, థాయ్, మెక్సికన్, పార్సీ థాలి వంటివి ఉన్నాయి. అల్పాహారం కోసం 75 వంటకాలు, లంచ్ కోసం 225 రకాలు, డిన్నర్ కోసం 275 రకాలు, లేట్ నైట్ కోసం 85 విభిన్న వంటకాలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు, ఇండోర్ సంప్రదాయ వంటకాల కోసం ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రీవెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరయ్యే అతిథుల కోసం లాండ్రీ, ఖరీదైన దుస్తులు, చీరలు కట్టేవారు, హెయిర్ స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టులు అందుబాటులో ఉన్నారు. జామ్‌నగర్ విమానాశ్రయం నుంచి వేడుకలు జరిగే గ్రాండ్ రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌కు అతిథులను తరలించేందుకు రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ వంటి విలాసవంతమైన కార్లను సిద్ధం చేశారు.
గ్లోబల్ పర్సనాలిటీలైన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్, అడోబ్ సీఈవో శంతను నారాయన్ సహా పలువురు ప్రముఖులతోపాటు బాలీవుడ్ నుంచి షారూఖ్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, సల్మాన్‌ఖాన్ వంటివారు వేడుకకు హాజరైయ్యారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులతో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్, షారుక్, ఆమిర్‌లు ఒకచోట కలవడం చాలా అరుదు. అలాంటిది ముగ్గురు కలిసి అంబానీ ఈవెంట్‌లో ఫేమస్ పాటలకు డ్యాన్స్ వేసి అలరించారు. ఇందులో భాగంగానే నాటునాటు స్టెప్ వేశారు. ఆతర్వాత వారి సినిమాల్లో పాటల హుక్ స్టెప్‌లను రీక్రియేట్ చేశారు.
ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ మార్చి 3 వరకు జరగనున్నాయి. మొదటి రోజు జమ్నా నగర్ ప్రాంత ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు అంబానీ. ఈ కార్యక్రమంలో దాదాపు 20వేలకు పైగా పాల్గొన్నట్లు సమాచారం. ఇక రెండో రోజు శనివారం ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరిగాయి. ఈ వేడుకలలో అనంత్ అంబానీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు.. తన ఫ్యామిలీ సపోర్ట్ గురించి భావోద్వేగ స్పీచ్ ఇచ్చారు. అనంత్ మాట్లాడుతున్న సమయంలో ఆయన తండ్రి ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు మాటలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.