పాపం అభిజిత్..గెలిచినా 'లాభం' లేదు!
బిగ్ బాస్ ట్రోఫీ గెలిచింది అభిజిత్. కానీ, ప్రేక్షకుల మనసులు గెలిచింది మాత్రం సోహైల్. అంతే కాదు ఐదు లక్షలు ఎక్కువగా గెలుచుకున్నాడు.
బిగ్ బాస్ రియాల్టీ షో అంటేనే ఓ మాయాబజార్ లాంటిది. అది నిజంగా పద్దతిగా సాగుతుందో.. వెనుక ఉండి ఎవరన్నా ఆడిస్తారో.. ఇప్పటికీ ఎవరికీ అర్ధం కాదు. చాలా వినోద కార్యక్రమాల్లానే దీనిని ప్రేమించే వారు ఉన్నారు. ద్వేషించే వారూ ఉన్నారు. అయితే, బిగ్ బాస్ జరిగే మూడు నెలలు మాత్రం ఎంతో మందికి చేతినిండా పని. జేబు నిండా డబ్బు. ఈ షో కోసం పనిచేసే వారనే కాదు. బయట ఉంది షో గురించి వీడియోలు.. మీమ్ లు.. ఇంటర్వ్యూలు.. ఇలా ఒకటేమిటి డిజిటల్ మీడియాలో ఎన్ని రకాలుగా ముందుకు వెళ్ళవచ్చో అన్నిరకాలుగానూ చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సరే అది పక్కన పెట్టి అసలు విషయంలోకి వద్దాం.
బిగ్ బాస్ అంటే ప్రేక్షకుల్లో ఏమాత్రం క్రేజ్ ఉందనేది వదిలేస్తే.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వారు మాత్రం ప్రతి ఒక్కరూ ముందు ఒక వారం ఉంటే చాలు అనుకుంటారు.. తరువాత కొద్దిరోజులు ఉండాల్సిందే అని పట్టుదలకు వస్తారు. ఎనిమిది వారాలు గడిచేసరికి కచ్చితంగా ట్రోఫీ సాధించేది నేనే అనే నమ్మకంతో ఆడతారు. ట్రోఫీ లేకపోయినా బిగ్ బాస్ టాప్ త్రీ లేదా టూ లోకి వస్తే చాలు పెద్ద పేరు వచ్చేస్తుందని నమ్ముతూ ఉంటారు.
కొంత మంది మాత్రం మేం బిగ్ బాస్ ట్రోఫీ కోసమే వచ్చాం.. కచ్చితంగా అదే మా టార్గెట్ అని ఆట ఆడుతారు. వీళ్ళ ఆట హౌస్ లో ఉండదు. హౌస్ బయట ప్రత్యేకంగా ఓటింగ్ ను ప్రభావితం చేసేలా ఏర్పాట్లు చేసుకుని లోపల కూల్ గా కూచుంటారు. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఒళ్ళు అలిసేలా ఆడిన వారు విజేతలు కాలేదు. శివ బాలాజీ కానీ, కౌశల్ కానీ, రాహుల్ సిప్లిగంజ్ కానీ.. వీరంతా బిగ్ బాస్ హౌస్ లో ఇరగదీసింది ఏమీ లేదు. వాళ్ళు బయట మేనేజ్ చేసుకున్న విధానమే విజేతలుగా నిలబెట్టింది. వాళ్ళతో పాటు రెండో ప్లేసులో నిలిచిన వారికే బిగ్ బాస్ ప్రేక్షకుల నుంచి ఎక్కువ మద్దతు ఉంటూ వచ్చింది.
సరిగ్గా అలాగే జరిగింది బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా. ఈసారి అభిజిత్ రూపంలో మరో స్మార్ట్ ప్లేయర్ హౌస్ లో కనిపించాడు. ఎప్పుడు సోఫాల మీదే ఉండే వాడు ఫైనల్ కి ఎలా వచ్చాడు అనే అర్థం వచ్చేలా గ్రాండ్ ఫినాలే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి కూడా అభిజిత్ మీద పంచ్ వేశారు.
అటువంటి అభిజిత్ ఈ సీజన్ విజేతగా గెలిచాడు. ముందే చెప్పినట్టు టైటిల్ విన్నర్ కంటే రన్నరప్ కె ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంటుంది. దానికి ఉదాహరణ శ్రీముఖి.. గీతా మాధురి.. ఆదర్శ్ లు. వీళ్ళు టైటిల్ గెలుస్తారని సాధారణ ప్రేక్షకులు భావించారు. అయితే, హౌస్ లో కంటే బయట చేసిన లాబీయింగ్ తో రాహుల్ సిప్లిగంజ్, కౌశల్, శివ బాలాజీ విన్నర్లుగా నిలిచారు. ఇప్పుడు అదే దారిలో అభిజిత్ కూడా.
మొదటి మూడు సీజన్లు ఒక ఎత్తైతే.. ఈ సీజన్ వాటన్నిటికి భిన్నం. కరోనా నేపధ్యంలో ఒక్కరు కూడా పేరున్న వారు బిగ్ బాస్ హౌస్ లో లేరు. కొద్దో గొప్పో అవినాష్, అభిజిత్, కరాటే కల్యాణి వంటి వారే ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఎవరికీ ఏమాత్రం తెలీని సోహెల్.. హారిక.. అరియానా..అఖిల్ వీళ్ళు బిగ్ బాస్ ప్రేక్షకుల మనసులు గెలిచేశారు. మొత్తమ్మీద తమ ఆట తీరు.. మాట తీరుతో చివరి ఐదుగురిలో నిలిచారు. ఇక ఫినాలేలో పోటీలో ఇద్దరే ఉండాల్సిన పరిస్థితిలో బిగ్ బాస్ స్క్రిప్ట్ అనుకోండి.. ఓటింగ్ అనుకోండి.. హారిక, అరియానా బయటకు వచ్చేశారు.
ఇక మిగిలిన ముగ్గురూ ముగ్గురే. ఒకరు పులిహోర రాజా.. ఒకరు ఓటింగ్ పులి.. ఒకరు సింగరేణి పులి. వీళ్ళలో ఎవరు బయటకు వెళ్ళిపోతారు అనే ప్రశ్న వచ్చినపుడు చాలా మంది అఖిల్ బయటకు వచ్చేస్తాడని అనుకున్నారు. (లీకు వీరులు కూడా రెండు రోజుల ముందు నుంచి అదే చెబుతూ వచ్చారు) ప్రేక్షకులు కూడా దాదాపు అదే ఫిక్స్ అయ్యారు. కానీ, బిగ్ బాస్ ఫినాలే అందరి అంచనాలను తారుమారు చేసింది.
వీరి ముగ్గురి మధ్య విచిత్రమైన లింక్ పెట్టేశాడు బిగ్ బాస్. ఓ పాతిక లక్షలు తీసుకుని ముగ్గురిలో ఒకరు వెళ్ళిపొండి అన్నాడు. దానికి ముగ్గురూ ససేమిరా అన్నారు. అన్నట్టు ఈ పాతిక ప్రైజ్ మనీలోంచి తీసి ఇస్తున్నాం. గెలిచిన వాడికీ పాతికే వస్తుంది.. ఇప్పుడు మీలో ఎవరన్నా పాతిక తీసుకుపోతే అన్నాడు బిగ్ బాస్. వెంటనే సోహైల్ బుర్ర పాదరసంలా పనిచేసింది. పాతిక చాలు ట్రోఫీ వద్దు అన్నాడు. అంతే.. వెంటనే అభినందనల మోత.. అక్కడా.. టీవీల ముందు కూచున్న ప్రేక్షకుల నుంచీ కూడా.
సోహైల్ లాజిక్ సరిగ్గా వర్కౌట్ అయింది. ఎందుకంటే.. గెలిచినా అభిజిత్ తీసుకుపోయింది పాతిక లక్షలే. అయితే, సోహైల్ కి మరో అదృష్టం తలుపు తట్టింది. చిరంజీవి, నాగార్జున చెరో పది లక్షలూ సోహైల్ కి ఇచ్చారు. అందులో పది లక్షలు అనాధ ఆశ్రమానికి.. ఐదు లక్షలు మెహబూబ్ కి . అంటే మూడో స్థానంలో బయటకు వచ్చేసిన సోహైల్ కి 30 లక్షలు వచ్చాయి. విజేత కంటే ఎక్కువ. అదేవిధంగా చిరంజీవి అభినందనలూ దక్కాయి. ఇంకా చిరంజీవి సోహైల్ తీయబోయే సినిమాకి ఏ సహాయం కావాలన్నా చేస్తానని మాట ఇచ్చారు.
ఇప్పడు చెప్పండి విజేత కప్పు గెలిచిన వాడా? మనసులు గెలిచిన వాడా? అభిజిత్ ఆడలేదు అని ఎవరూ అనరు కానీ.. సోహైల్ బిగ్ బాస్ విజేత కావాలని చాలా మంది భావించారనేది నిజం.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ బయటకు వచ్చింది. మెహబూబ్ హౌస్ మేట్స్ ని కలవడానికి వెళ్ళినపుడు సోహైల్ 3వ స్థానంలో ఉన్నాడని తెలిసేలా సైగలు చేసాడని తెలుస్తోంది. అందుకే పాతికలక్షలు తీసుకుని బయటకు వచ్చేయడానికి సిద్ధం అయిపోయాడని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంతో తెలీయకపోయినా.. మొత్తమ్మీద విజేత కంటే ఎక్కువ సొమ్ము.. మరింత ప్రేమా తనతో తీసుకుపోయాడు సోహైల్!
బిగ్ బాస్ ట్విస్ట్ లలో ఇది అదిరిపోయింది కదూ!