Pushpa Movie Review: అల్లు అర్జున్ "పుష్ప" మూవీ రివ్యూ

*ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "పుష్ప"

Update: 2021-12-17 06:26 GMT

Pushpa Movie Review: అల్లు అర్జున్ "పుష్ప" మూవీ రివ్యూ

Pushpa Movie Review: "ఆర్య", "ఆర్య 2" సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "పుష్ప". రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా లోని మొదటి భాగం "పుష్ప: ది రైజ్" ఇవాళ అనగా డిసెంబర్ 17, 2021 న విడుదలైంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు సునీల్. మలయాళం స్టార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న ఈసినిమా శేషాచలం అడవుల్లో నేపద్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ తో సాగనుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

చిత్రం: పుష్ప- ది రైజ్

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, సునీల్, ఫహాధ్ ఫాసిల్, అనసూయ, రావు రమేష్, అజయ్ ఘోష్ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శేఖర్

దర్శకత్వం: సుకుమార్

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్

విడుదల తేది: 17/12/2021

కథ:

పుష్పరాజ్ (అల్లుఅర్జున్) ఒక డైలీ లేబరర్. కొండా రెడ్డి, జాలి రెడ్డి మరియు జక్క రెడ్డి ల కింద ఉండే ఒక గ్రూప్ లో పని చేస్తూ ఉండేవాడు. అందరూ కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళు. కానీ నెమ్మదిగా ఒక మామూలు కూలి నుంచి ఓనర్ గా మారిపోతాడు పుష్ప రాజ్. అప్పుడే మంగళం శ్రీను (సునీల్) వల్ల ఇబ్బందుల్లో పడతాడు పుష్పరాజ్. కానీ అవన్నీ దాటుకొని స్మగ్లింగ్లో డాన్ గా ఎలా ఎదిగాడు? అనేది పుష్ప కథ. శ్రీవల్లి (రష్మిక మందన్న) తో అతని ప్రేమ కథ ఏంటి? భాన్వర్ సింగ్ శేకావాట్ (ఫహాధ్ ఫాసిల్) తో పుష్ప రాజ్ కి వైరం ఎలా ఏర్పడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు అల్లు అర్జున్. పుష్ప రాజ్ పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించాడు. సినిమా కోసం తన లుక్ ని మార్చుకున్న బన్నీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అని తెలుస్తోంది. ఆ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో సహా చాలా మార్పు చూపించిన బన్నీ చిత్తూరు యాసలో చాలా బాగా మాట్లాడారు. ఇక సినిమా మొత్తాన్ని పుష్పరాజ్ పాత్ర తన భుజాలపై మోసాడు అనడంలో అతిశయోక్తి లేదు. రష్మిక మందన్న పాత్ర కి పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ తనకున్న పరిధిలో రష్మిక చాలా బాగా నటించింది. సునీల్ కూడా ఈ సినిమాలో చాలా కొత్త లుక్ తో కనిపించాడు. తన పాత్రలో చాలా బాగా నటించాడు. ఫహాధ్ ఫాసిల్ పాత్రకి ఈ సినిమాలో పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. అనసూయ పాత్ర కూడా అంతంత మాత్రంగానే ఉంది.

సాంకేతికవర్గం:

"రంగస్థలం" సినిమా లాగానే సుకుమార్ ఈ సినిమాలో కూడా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో పెద్ద కథ ఉండదు కేవలం పుష్పరాజ్ ఎలా ఎదిగాడు అని ఒక చిన్న పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అయితే ఎంటర్ టైన్ మెంట్, స్క్రీన్ ప్లే మరియు నటీనటులు ఈ సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే కథ చాలా సాదాసీదాగా ఉంటుంది తప్ప కొత్తదనం లేదు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు అన్ని చార్ట్ బస్టర్లు సంగతి తెలిసిందే. నేపథ్య సంగీతం విషయంలో కూడా దేవిశ్రీ ప్రసాద్ మంచి మార్కులు వేయించుకున్నారు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది. ఎడిటింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.

బలాలు:

  • అల్లు అర్జున్
  • డైలాగులు
  • ఫస్ట్ హాఫ్

బలహీనతలు:

  • ప్రెడిక్టబుల్ గా అనిపించే కథ
  • ప్రాధాన్యత లేని పాత్రలు
  • ఆఖరి అరగంట

చివరి మాట:

ఈ కథలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ అందులో ఒక్క పాత్ర కూడా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ కలిగించుకోవడం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. సునీల్ పాత్ర వెళ్లిపోయిన అప్పటి నుంచి కథ రీ స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు అవసరం లేకుండా డ్రాగ్ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప మరియు భన్వర్ పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ ఇంకొంచెం బాగా చూపించి ఉంటే బాగుండేది. ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్ ఆ ఫ్లో ను క్యారీ చేయలేకపోతోంది. రన్ టైం కూడా చాలా ఎక్కువగా ఉండటంతో కథని బాగా డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది. ఐటెం సాంగ్లో సమంత పర్వాలేదు అనిపించింది. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కి ఇంకొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది.

బాటమ్ లైన్:

స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్తో సాగే "పుష్ప" రాజ్ కథ ఒక యావరేజ్ యాక్షన్ డ్రామాగా మిగిలింది.

Tags:    

Similar News