Allu Arjun: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్
Allu Arjun: పాన్ ఇండియా సినిమాలు తీయడం గొప్ప కాదు.. వాటిని అదే స్థాయిలో ప్రేక్షకులకు చేరవేయడం కూడా అంతే అవసరం అంటున్నాయి బాక్సాఫీస్ వర్గాలు.
Allu Arjun: పాన్ ఇండియా సినిమాలు తీయడం గొప్ప కాదు.. వాటిని అదే స్థాయిలో ప్రేక్షకులకు చేరవేయడం కూడా అంతే అవసరం అంటున్నాయి బాక్సాఫీస్ వర్గాలు. అంతేకాదు ఒక హీరో తన సినిమాకు ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవడం కూడా ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఆడియన్స్‌కు వారు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ విషయంలో ఆ జాగ్రత్త తీసుకుని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు ఫీల్ అవుతున్నట్టు సమాచారం.
పుష్ప 2 తెలుగు సినిమా అయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్‌లో వివిధ భాషల్లోకి డబ్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేశారు. పుష్ప సినిమా నార్త్ ఇండియా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ క్రమంలోనే బిహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఇది పాట్నా చరిత్రలో ఎన్నడూ జరగని పెద్ద ఈవెంట్‌గా పుష్ప మూవీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో పాటు ప్యాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. ప్రభాస్ మొదలు.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరూ ప్యాన్ ఇండియా మార్కెట్‌లో దూసుకుపోతున్నారు. అయితే ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం తన పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకోలేకపోయారు. హిందీలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటే బాగుండేది అన్న టాక్ అభిమానుల నుంచి వ్యక్తం కావడం విశేషం.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం హిందీ, తమిళం, కన్నడలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి పాత్రలకు వారే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఒక్క మలయాళ భాషలో మాత్రమే వేరే వాళ్లు వీళ్ల పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇక దేవర సినిమా కోసం మలయాళం తప్పించి అన్ని భాషల్లో ఎన్టీఆర్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఆయా భాషల్లో ఆడియన్స్‌కు కనెక్ట్ కావడానికి అది బాగా ఉపయోగపడుతోంది.
ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా హిందీ వెర్సన్ కోసం అల్లు అర్జున్ పాత్రకు శ్రేయస్ తల్పడేతో డబ్బింగ్ చెప్పించారు. ఒకవేళ అల్లు అర్జున్ తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పుకుని ఉంటే హిందీ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేవారని టాక్ నడుస్తోంది. మరి రాబోయే సినిమాల విషయంలో అల్లు అర్జున్ హిందీతో పాటు కన్నడ, తమిళంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారా.. లేదా చూడాలి మరి. మరోవైపు పుష్ప ది రూల్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బన్నీ యాక్షన్‌కు సుకుమార్ డైరెక్షన్‌కు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఓ రేంజ్‌లో కనిపిస్తోంది.