Naandhi Movie Review: అల్లరి నరేష్ నాంది మూవీ రివ్యూ
కామెడీ సినీమాలకు అల్లరి నరేశ్ కేరాఫ్ అడ్రస్. కానీ, తన శైలికి భిన్నంగా 'నాంది' సినిమాలో సీరియస్ గా కనిపించారు.
కామెడీ సినిమాలకు అల్లరి నరేశ్ కేరాఫ్ అడ్రస్. కానీ, తన శైలికి భిన్నంగా 'నాంది' సినిమాలో సీరియస్ గా కనిపించారు. గతంలో నటించిన 'గమ్యం' 'శంభో శివ శంభో' 'మహర్షి' సినిమాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు. చాలా రోజులుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న నరేశ్ కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిచ్చింది. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు రూపొందించిన 'నాంది' సినిమాగా ఏ మేర మెప్పించిందో చూద్దాం..
కథ
బండి సూర్య ప్రకాశ్ (అల్లరి నరేష్) ఒక మధ్య తరగతి కుర్రాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. తల్లిదండ్రులు, ప్రాణంగా ప్రేమించే స్నేహితుడితో సంతోషంగా జీవిస్తుంటాడు. ఈ క్రమంలో అతను అనుకోకుండా రాజగోపాల్ (సి.వి.ఎల్. నరసింహారావు) అనే లాయర్ హత్య కేసులో చిక్కుకుంటాడు. ఐదేళ్ల పాటు జైలులోనే మగ్గుతాడు. ఇంతకీ ఈ హత్య సూర్యప్రకాశ్ చేశాడా? జూనియర్ లాయర్ ఆద్య (వరలక్ష్హి శరత్ కుమార్), సూర్యప్రకాష్ ను బయటికి తీసుకురావడానికి ఏం చేసింది.. హత్య కేసులో అసలు దోషులెవరు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
చేయని నేరానికి జైలు పాలైన ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి.. తన పోరాటంతో ఎలా బయటికి వచ్చాడు.. తనను ఇరికించిన వాళ్లపై ఎలా పోరాడి గెలిచాడు అనే పాయింట్ తో ఈ సినిమా నడుస్తుంది. తెలుగు సినిమాలలో ఇలాంటి ప్రయత్నాలు చాలా అరుదే అని చెప్పాలి. ఫస్టాప్ లో హీరో జీవితం, అనుకోని హత్య కేసులో అరెస్టు అవ్వడం, జైలు గోడల నేసథ్యంలో సాగుతుంది. సెకాండ్ ఆఫ్ లో కోర్టులో సీన్లు చాలా కీలకంగా సాగుతాయి. హీరో భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు త్యాగం చేసిన చిన్న చిన్న ఆనందాల్ని మనసుకు హత్తకునేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. సంతోషంగా సాగుతున్న వారి జీవితాలో ఒక్కసారిగా ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఆ కుటుంబం పడే బాధని చక్కగా తరెపైకి తీసుకొచ్చారు.
ఇక విశ్రాంతికి ముందు వచ్చే మలుపు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. హీరో బయటికి రావడం వరకు రొటీన్ గా అనిపించినా.. ఆ తర్వాత అతను ఆవేశపడకుండా తనను ఇరికించిన పోలీస్ మీద రివర్సులో 211 కేసు పెట్టడం.. దాని కోసం పోరాడటం ఈ సినిమాలో కొత్తగా.. ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రీక్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి.
ఎవరు ఎలా చేశారంటే..
ఈ చిత్రం నరేశ్ కెరియర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం నవ్వించడమే కాదు..ఏడిపించడం కూడా తెలుసని మరోసారి ఈ సినిమాతో నిరూపించాడు. సూర్య అనే మిడిల్ క్లాస్ కుర్రడి పాత్రకి ప్రాణం పోశాడు. జూనియర్ లాయర్ పాత్రలో వరలక్ష్మీ ఒదిగిపోయింది. వరలక్ష్మీ పాత్ర కూడా ఈ సినిమాకు చాలా ప్లస్. ఏసీపీ కిషోర్ అనే నెగెటివ్ పాత్రలో హరీష్ ఉత్తమన్ మెప్పించారు. ప్రవీన్, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ తమ పరిధి మేరకు నటించారు. శ్రీచరణ్ తన రీరికార్డింగ్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఈ సినిమాలో పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. సిధ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ చోటా కే ప్రసాద్ పనితీరు కూడా బాగుంది. ఎక్కడా సాగతీత లేకుండా సినిమాను స్పీడ్ గా నడించాడు.