ఇరవై నాలుగేళ్లయినా ఇప్పటికీ ఎవర్ గ్రీన్.. నాగార్జున 'నిన్నే పెళ్ళాడుతా!'
Akkineni Nagarjuna Ninne Pelladatha: కింగ్ నాగార్జున.. టబు జంటగా కృష్ణవంశీ తెరకెక్కిన్ మ్యూజికల ఎంటర్టైనర్ నిన్నేపెళ్ళాడుతా సినిమాకి 24 ఏళ్లు!
ఏటో వెళ్ళిపోయింది మనసూ.. అంటూ ప్రేక్షకుల మనసుల్ని ఎక్కడికో తీసుకు వెళ్ళిపోయిన సినిమా నిన్నే పెళ్ళాడుతా!. ఒకదాన్ని మించిన ఒక పాట.. సినిమా ప్రారంభం నుంచీ కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు.. వెండితెర నిండుగా తారాగణం.. ఆ సమయానికి ఉన్న పరిస్థితులకు మించిన ఆధునికత.. అన్నీ ఎందుకు.. ప్రేమ కథలకు కింగ్ నాగ్ తప్పితే ఎవరో పనికిరారు అన్నంతగా నాగార్జున కెరీర్ ఎలివేట్ చేసిన సినిమా.. నిన్నే పెళ్ళాడుతా!. హోమ్లీ లుక్ తోనే కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టేసిన టబు.. తన అదరగొట్టే నటనతో మహిళా ప్రేక్షకుల్ని తమ వెంట తీప్పేసుకున్న లక్ష్మి, మంజు భార్గవి, అడుగడుగునా నాగార్జున పక్కనే ఉంటూ ప్రేక్షకులను కితకితలు పెట్టిన బ్రహ్మాజీ.. చంద్రమోహన్, చలపతి రావు, ఆహుతి ప్రసాద్, గిరిబాబు ఇలా సినిమా తెరనిండా తారాగణం.. శీనుగాడి ప్రేమకథని పెళ్లిదాకా తీసుకువెళ్ళే అందమైన కథనం.
గ్రీకువీరుడిలా నాగార్జున ను ప్రాజెక్టు చేసి.. మన పక్కింటి కుర్రోడిలా అందరికీ చేరువ చేసిన సినిమా నిన్నే పెళ్ళాడుతా.. అవునూ ఇప్పుడు సడెన్ గా నిన్నేపెళ్ళాడుతా హడావుడి ఏమిటి అనుకుంటున్నారా? ఈరోజుకి అంటే అక్టోబర్ 4 కి సినిమా విడుదలై సరిగ్గా 24 ఏళ్లు! 1996 అక్టోబర్ లో దసరా సీజన్లో విడుదలైన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. ఎక్కడ విన్నా. ఈ సినిమా పాటలే! శీను గాడు.. మహాలక్ష్మి సూపర్ పాపులర్గా మారిపోయారు. అంటే నాగార్జున.. టబు.. వాళ్లిద్దరే కాదు.. శీనుగాడు..మహాలక్ష్మి పేర్లు ఒక్కసారిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రమంతా ఫేమస్ అయిపోయాయి. ఇక టబు ముద్దుపేరు పండు అయితే.. చెప్పక్కర్లేదు. ఒక సినిమాలోని పాత్రల పేర్లు కూడా ఇంత వెలుగు వేలుగుతాయని బహుశా అప్పటివరకూ ఎవరూ ఊహించి కూడా ఉండరు.
నిన్నే పెళ్ళాడుతా సినిమా షూట్ లో ఉండగానే క్రేజీ ప్రాజెక్ట్ గా భావించారు అందరూ. కృష్ణ వంశీ దర్శకుడిగా..నాగార్జున నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తారాగణమే కాదు.. తెరవెనుక పనిచేసిన వారంతా కూడా తరువాత మరో లెవెల్ కి వెళ్ళిపోయారు. వైవీఎస్ చౌదరి ఈ సినిమా కో డైరెక్టర్. అలాగే ఉత్తేజ్.. ఉమేష్ శర్మ డైలాగులు అందించారు. ఇక కథ.. స్క్రీన్ప్లే కృష్ణ వంశీ.
నిన్నేపెళ్ళాడుతా సినిమా పాటలు..నేపధ్య సంగీతం అప్పట్లో సెన్సేషన్. అప్పుడే కాదు ఇప్పుడూ ఈ సినిమా పాటలు టాప్ లిస్టు లో ఉంటాయి. ఆ స్థాయిలో సంగీతాన్ని ఇచ్చింది సందీప్ చౌతా. సినిమాలో పాటలు కూడా సందీప్ చౌతా.. హరిహరన్..చిత్ర..జిక్కీ పాడారు. సిరివెన్నెల.. సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నిన్నే పెళ్ళాడుతా సినిమా అంతా.. శీను..పండు ప్రేమ చుట్టూ తిరుగుతుంది. శీను..పండు ప్రేమకథను హద్దులు దాటని రోమాన్స్ తో ముద్దుగా తెరకెక్కించిన కృష్ణవంశీ.. కుటుంబంలోని బంధాలను అంతకంటే హృద్యంగా చూపించారు. ప్రతి ఫ్రేం లోనూ ఆఖరికి నాగ్ టబు రోమాన్స్ సీన్లలో కూడా తెరనిండా నటీనటులు కనిపిస్తారు. ఒకరకంగా కృష్ణ వంశీ సిగ్నేచారే అది కదా. నాగార్జున అయితే, అప్పటివరకూ తాను చేసిన పాత్రలకు చాలా భిన్నమైన పాత్రలో ఒదిగిపోయారు. సినిమా చూస్తున్న వారు నాగార్జునలో శీను గాదినే చూస్తారు. ఆయన పక్కన టబు కూడా అలానే ఒదిగిపోయారు. ఆమెను నాగార్జున టీజ్ చేసే సీన్లలో ఆదరగోట్టేశారు.
లవ్..రోమాన్స్..కామెడీ..యాక్షన్..ఫ్యామిలీ డ్రామా ఇలా ఏ అంశాన్ని వదలకుండా.. కథ.. కథనం ఎక్కడా చెదరకుండా.. సినిమాలో ఉన్న ప్రతి నటుడికి ప్రాధాన్యం ఇస్తూ నిన్నేపెళ్ళాడుతా సినిమా నడిపించారు కృష్ణ వంశీ. ఇరవై నాలుగేళ్ళు గడిచిపోయినా నిన్నే పెళ్ళాడుతా ఇప్పుడు చూసినా తాజాగా అనిపిస్తుంది. మీరూ ఈ సినిమా ఓసారి చూడండి.. యుట్యూబ్ లో సినిమా ఉంది.. అలాగే డిస్నీ హాట్ స్టార్ లోనూ ఉంది.
ఈ సినిమాని తలుచుకుంటూ నాగార్జున ఓ ట్వీట్ కూడా ఈరోజు చేశారు. మీకోసం ఆ ట్వీట్..