గ్రే డైవర్స్ నిజమేనా? మణిరత్నం కోసం ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ కలిసి పని చేస్తారా?
Aishwarya Rai Bachchan and Abhishek Bachchan: గత కొద్దిరోజులుగా ఐశ్వర్య, అభిషేక్ పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Aishwarya Rai Bachchan and Abhishek Bachchan: గత కొద్దిరోజులుగా ఐశ్వర్య, అభిషేక్ పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్ధరు విడిపోతారని.. విడివిడిగా ఉంటున్నారని నెట్టింట రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మణిరత్నం వీరిద్దరితో కలిసి సినిమా తీయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అభిషేక్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నారని.. అందువల్లే ఆ ఇద్దరి మధ్య విభేధాలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు మణిరత్నం వల్ల మళ్లీ వీరిద్దరూ కలిసే అవకాశం ఉందన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. డైరెక్టర్ మణిరత్నం అంటే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌కి చాలా గౌరవం. ఈ విషయాన్ని సందర్బం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటారు. మణిరత్నం దర్శకత్వంలో పనిచేయాలని అందరూ కోరుకుంటారని.. ఆయన సినిమాల్లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని అభిషేక్ గతంలో తెలిపారు.
తిరువర్, గురు, రావణ్, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాల్లో మణిరత్నం తనకు అవకాశం కల్పించారని అన్నారు. ఆయన తనకు గురువు అని ఐశ్వర్య ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు మణిరత్నం అడిగితే ఈ ఇద్దరూ కాదనరని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.
గతంలో అభిషేక్, ఐశ్వర్య కలిసి చాలా సినిమాలు చేశారు. వాటిలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గురు ప్రత్యేకమైనది. వీరి వివాహానికి ముందు ఈ సినిమా విడుదలై ఆకట్టుకుంది. అందులో వీరిద్దరి కెమిస్ట్రీ అందరినీ కట్టిపడేసింది.
అభిషేక్, ఐశ్వర్యల వివాహమై 17 ఏళ్లు అవుతోంది. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఐష్-అభిషేక్ దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అంబానీ ఫ్యామిలీ పెళ్లికి ఐశ్వర్య, అభిషేక్ విడివిడిగా వచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య తన తల్లితో కలిసి జీవిస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు వారి విడాకుల పుకార్లకు మరింత ఆద్యం పోసినట్టైంది. ఇంత జరుగుతున్నా విడాకులపై వస్తున్న రూమర్స్‌ను వీరిద్దరు ఖండించకపోవడం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది.
గ్రే డైవోర్స్
తాజాగా ఈ ఇద్దరూ తీసుకోబోయే విడాకులకు మాత్రం కొత్త ట్యాగ్ తగిలించారు. వీరిద్దరూ గ్రే డైవోర్స్ తీసుబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గ్రే డైవర్స్ సంస్కృతి విదేశాల్లో ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే మనదేశంలోని ప్రధాన నగరాల్లో వ్యాపిస్తోంది. యాభై ఏళ్ల వయసు దాటినవారు గ్రే డైవర్స్ తీసుకోవాలనే నిర్ణయాన్ని తీసుకుంటారు. తమ దాంపత్యం జీవితం ఇంతటితో చాలు.. ఇక ముగిద్దామనే నిర్ణయానికి వస్తారు. దీనిని గ్రే డైవోర్స్ అని పిలుస్తారు. అయితే గ్రే విడాకుల పెరుగుదలను గురించి చర్చించే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్టును అభిషేక్ లైక్ చేయడంతో ఈ గ్రే డైవర్స్ ఊహాగానాలు ఎక్కువయ్యాయి.