Meenakshi Chaudhary: ఆ పాత్రలో నటించను.. మీనాక్షి చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పేరు ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగిపోతోంది. ఈ బ్యూటీ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోందీ. 2019లో హిందీ సినిమా అప్‌స్టార్ట్స్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన మీనాక్షి.. 2021లో వచ్చిన 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ మూవీతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇక హిట్ మూవీతో కమర్షియల్‌గా తొలి విజయాన్ని అందుకుంది. దీంతో ఏకంగా మహేష్ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది. గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్గా నటించింది మెప్పించింది.
తాజాగా లక్కీ భాస్కర్ మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో గృహిణి పాత్రలో మంచి నటనను కనబరిచిందీ పంజాబీ బ్యూటీ. అయితే తాజాగా లక్కీ భాస్కర్ మూవీ గురించి మాట్లాడుతూ తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత కొన్ని రోజులుగా వరుసగా భార్య పాత్రల్లో నటిస్తున్నాని తెలిపిన మీనాక్షి, కొంతకాలం పాటు ఆ తరహా క్యారెక్టర్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లక్కీ భాస్కర్ మూవీలో తన నటనకు మంచి ప్రశంసలు దక్కాయని అయితే.. కొంతమంది మాత్రం కెరీర్ ఆరంభంలో హౌస్‌వైఫ్ పాత్రలు చేయకపోవడమే బెటర్ అని, అందుకు చాలా సమయం ఉందని సలహా ఇచ్చారని తెలిపారు. ఇతరుల అభిప్రాయాలు పక్కన పెడితే ఆ క్యారెక్టర్‌ను తాను ఎంతగానో ఇష్టపడి చేశానని తెలిపింది. అయితే రానున్న కొన్నేళ్లపాటు ఆ తరహా పాత్రలను చేయొద్దని నిర్ణయించుకున్నాని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఓ యాక్షన్ మూవీలో నటిస్తున్నానని తెలిపిన మీనాక్షి.. ఆ సినిమాలో పోలీస్ క్యారెక్టర్లో నటించనున్నట్లు తెలిపింది.