Manobala: ప్రముఖ కమెడియన్ మనోబాల కన్నుమూత
Manobala: కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాదపడుతూ
Manobala:తమిళ హాస్యనటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గత కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన బుద్ధవారం మధ్యాహ్నం మరణించారు. లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. మనోబాల తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. ఆయన నటించిన తమిళ సినిమాలు డబ్బింగ్ అవడంతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు. మనోబాల కామెడీ టైమింగ్ కు అందరూ ఫిదా అవుతుంటారు. తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో మనోబాల కచ్చితంగా ఉంటారు. విజయ్, రజనీ ఇలా అందరితోనూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.
మనోబాల మృతితో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. తెలుగులో ఆయన మహానటి, దేవదాసు, రాజ్ దూత్ చిత్రాల్లో నటించారు. రీసెంట్ గా వాల్తేరు వీరయ్య చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించారు. 1970లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మనోబాల..1979లో భారతీ రాజ్ వద్ద సహాయ దర్శకుడిగా చేరారు. ఆ తర్వాత దర్శకుడిగా ఎదిగి 20 చిత్రాలను తెరకెక్కించారు. మూడు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. దాదాపు 350 చిత్రాల్లో సహ నటుడిగా మెప్పించారు. మనోబాల పలు సీరియల్స్ లో నటించి బుల్లి తెర ప్రేక్షకుల అభిమానాన్ని సైతం సొంతం చేసుకున్నారు.