70th National Film Awards: నేషనల్‌ ఫిలిమ్‌ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. తెలుగు చిత్రాలకు..

ఉత్తమ ప్రాంతీయ విభాగంలో తెలుగులో కార్తికేయ 2 మూవీ నిలిచింది. నిఖిల్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో మంచి కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-08-16 10:18 GMT

70th National Film Awards: నేషనల్‌ ఫిలిమ్‌ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. తెలుగు చిత్రాలకు..

70th National Film Awards: కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే జాతీయ చలనచిత్ర పురస్కారలను ప్రకటించింది. తాజాగా 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను విడుదల చేసారు. ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్‌' అవార్డు దక్కించుకుంది. ఆనంద్ ఎకర్షి దర్శకత్వం వహించిన ఈ మలయాళ చిత్రం ఈసారి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక బెస్ట్ యాక్ట‌ర్‌గా కాంతార మూవీకిగాను రిష‌బ్ శెట్టి అవార్డును ద‌క్కించుకున్నారు. అలాగే ఉత్తమ హీరోయిన్‌ అవార్డు ఈసారి ఇద్దరు హీరోయిన్లను వరించింది. తరుచిత్రాంబళం చిత్రానికి గాను నిత్యామీనన్‌, కచ్‌ ఎక్స్‌ప్రెస్ మూవీకి గాను మానసి పరేఖ్‌ ఉత్తమ నటి విభాగంలో అవార్డులను సొంతం చేసుకున్నారు.

ఉత్తమ ప్రాంతీయ విభాగంలో తెలుగులో కార్తికేయ 2 మూవీ నిలిచింది. నిఖిల్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో మంచి కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. అయితే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది టాలీవుడ్‌కు తక్కువ అవార్డులు వరించాయని చెప్పాలి. 69వ నేష‌న‌ల్ అవార్డుల్లో బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో పాటు మొత్తం ప‌ది విభాగాల్లో అవార్డుల‌ను గెలుచుకొని జాతీయ స్థాయిలో టాలీవుడ్ స‌త్తా చాటింది. అయితే ఈసారి మాత్రం యాక్టింగ్‌తో పాటు సాంకేతిక విభాగాల్లో తెలుగు సినిమాకు ఒక్క అవార్డు కూడా ద‌క్క‌లేదు.

ఇదిలా ఉంటే కన్నడలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేజీయఫ్‌ 2 నిలవగా, తిమళంలో పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 నిలిచాయి. ఇక ఉత్తమ దర్శకుడు విభాగంలో ఉంచాయి సినిమాకుగాను సూరజ్‌ బర్జాత్యాకు నేషనల్ అవార్డు వరించింది. ఉత్తమ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ విభాగంలో కాంతార అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌ విభాగతంలో బ్రహ్మాస్త్ర పార్ట్‌1 చిత్రానికి నేషనల్ అవార్డ్‌ దక్కింది. ఉత్తమ దర్శకుడు (డెబ్యూ) ఫౌజా చిత్రానికి గాను ప్రమోద్‌ కుమార్‌ అవార్డును దక్కించుకున్నారు.

ఇదిలా ఉంటే తెలుగు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు దక్కింది. అయితే తమిళ మూవీ తిరుచిత్రాంబ‌ళం సినిమాకు గాను జానీ మాస్ట‌ర్ జాతీయ పుర‌స్కారం వరించింది. ఉత్తమ సహాయ నటిగా నీనా గుప్తా (ఉంచాయి- హిందీ), ఉత్తమ సహాయ నటుడుగా పవన్‌ రాజ్‌ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి), ఉత్తమ బాల నటుడిగా శ్రీపాథ్‌ (మలికాపురమ్‌ - మలయాళం) నిలిచారు.

జాతీయ ఉత్తమ నాన్‌ ఫీచర్‌ సినిమాల విషయానికొస్తే.. ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌గా ఉన్యుత (వాయిడ్‌) - అస్సామీ, ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ గా అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూ, ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌: మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌ (మరాఠీ) మూవీలు నిలిచాయి. అలాగే ఉత్తమ యానిమేషన్‌ సినిమాగా ఏ కోకోనట్‌ ట్రీ (సైలెంట్‌), ఉత్తమ దర్శకులుగా మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్‌ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్‌) నిలిచారు.  

Tags:    

Similar News