15 Years For Sri Ramadasu: 15 ఏళ్ల భక్తిరస కావ్యం "శ్రీరామదాసు"
15 Years For Sri Ramadasu: కొన్నిసినిమాలు ఎన్నేళ్లయినా గుర్తుండిపోతాయి. అలాంటి కోవలేకే వస్తుంది 'శ్రీరామదాసు'.
15 Years For Sri Ramadasu: కొన్నిసినిమాలు ఎన్నేళ్లయినా గుర్తుండిపోతాయి. అలాగే ఎన్నిసార్లు చూసినా… మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అలాంటి కోవలేకే వస్తుంది భక్తిరస మహాకావ్యం 'శ్రీరామదాసు'. పాటలతో మైమరించి, భక్తి పారవశ్యంలో పొంగిపోయేలా చేస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు, ఆయన తనయుడు నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమే క్రియోట్ చేసింది. ఈ చిత్రం 2006 మార్చి 30న రిలీజైంది. నేటిని(మార్చి 30, 2021 నాటికి) ఈ సినిమా 15 సంవత్సరాలను పూర్తిచేసుకుంటున్న సందర్భంగా… హెచ్ఎంటీవీ (hmtv) అందిస్తున్న స్పెషల్ స్టోరీ..
ఈ చిత్రంలో కబీర్ దాస్ పాత్రను ఏయన్నార్ పోషించారు. రామదాసు గా నాగార్జున జీవించారు. సంచలన దర్శకుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ఆదిత్య మూవీస్ పతాకంపై కొండా కృష్ణంరాజు నిర్మించారు.
యువసామ్రాట్ నాగార్జున తన తండ్రితో కలిసి "కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, ఇద్దరూ ఇద్దరే" మూడు సినిమాల్లో నటించారు. కాగా, 'ఇద్దరూ ఇద్దరే' సినిమా ఫెయిల్ అయింది. దీంతో తండ్రితో కలసి మరోసినిమా చేయనని కింగ్ నాగార్జున ప్రకటించారు. మరలా దాదాపు 16 ఏళ్ల తరువాత నాగేశ్వరరావు, నాగర్జున కలిసి నటించిన 'శ్రీరామదాసు' సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి, విమర్శకుల నోళ్లు మూయించింది.
తెలిసిన కథే… అయినా…!
భక్త రామదాసు కథ తెలుగు నేలపై తెలియని వారుడరంటే అతిశయోక్తి కాదు. అయినా దర్శకేంద్రుడు మాయాజాలంతో సినిమాను అందరికీ నచ్చేలా, రామదాసు కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక జె.కె భారవి కథలో మేళవించిన డ్రామా, మరింత ఆకర్షణీయంగా చేసింది. జె.కె. భారవి, రాఘవేంద్రరావు ఒక్కటై సినిమాను అద్భుత మహాకావ్యంలా తీర్చిదిద్దారు.
'శ్రీరామదాసు' సినిమాకు ప్రాణం పోసింది అంటే సంగీతం, సాహిత్యాలే. ఈ సినిమాలో రామదాసు కీర్తనలతో పాటు, కొన్ని పాటలను వేటూరి, సుద్దాల, చంద్రబోస్, జె.కె.భారవి ప్రత్యేకంగా రాసిన పాటలు తెలుగు నేలపై మారుమ్రోగాయి. ఇక కీరవాణి తన సంగీతంతో పాటలకు ప్రాణం పోశారు. "అంతా రామమయం... జగమంతా రామమయం…", "అల్లా… ", "ఏ మూర్తి ఆ మూర్తి…" పాటలు ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతాయనండంలో సందేహం లేదు. ఇప్పటికీ రాములోరి కల్యాణం సందర్భంగా చాలా ఊర్లల్లో ఈ పాటు వినిపిస్తూనే ఉంటాయి. ఈ పాటలు వింటే మనసుకు చాలా ప్రశాంతత చూకూరుతుంది. 'శ్రీరామదాసు' మ్యూజిక్ తోనే ఆకట్టుకోవడం కాదు… సినిమా కూడా ప్రేక్షకులను రామదాసు కాలానికి తీసుకువెళ్లేలా చేస్తుంది. ఈ సినిమా అనేక కేంద్రాలలో శతదినోత్సవ సంబురాలను చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించి, నిర్మాతలకు లాభాలను ఆర్జించి, మరిన్ని భక్తి సినిమాలు తీసేందుకు ప్రేరణగా నిలిచింది.
ఇక ఈ సినిమాలో శ్రీరామ, శ్రీమహావిష్ణువుగా సుమన్ నటించగా, సీతగా వేద, రామదాసు భార్యగా స్నేహ, భద్రునిగా శరత్ బాబు, దమ్మక్కగా సుజాత, అబుల్ హసన్ కుతుబ్ షాగా నాజర్, రావణునిగా నాగబాబు, ధర్మవరపు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, ఏవీయస్, రఘుబాబు, సునీల్, రంగనాథ్, రఘునాథ రెడ్డి, జె.కె.భారవి ఇతర పాత్రల్లో కనిపించారు.
విజయమే కాదు.. అవార్డులను సొంతం చేసుకుంది
శ్రీరామదాసుగా నటించిన అక్కినేని నాగార్జునకు ఉత్తమ నటునిగా నంది అవార్డు దక్కింది. ఇంటిల్లి పాది హాయిగా చూడతగ్గ సినిమాగా, అలాగే మేకప్ మేన్ రామచంద్రరావుకు కూడా నంది అవార్డులు దక్కాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకునిగా , ఎస్.గోపాల్ రెడ్డికి ఉత్తమ ఛాయాగ్రాహకునిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులను అందించింది శ్రీరామదాసు.