Liger Review: 'లైగర్‌' రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Liger Review: ‘లైగర్‌’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Update: 2022-08-25 07:14 GMT

Liger Review: ‘లైగర్‌’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: లైగర్

నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయి, అలి, మకరంద్ దేశ్ పాండే, మైక్ టైసన్, గెటప్ శ్రీను, విష్ణు రెడ్డి తదితరులు

సంగీతం: సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ

నిర్మాతలు: కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి కౌర్, అపూర్వ మెహతా

దర్శకత్వం: పూరి జగన్నాథ్

బ్యానర్లు: ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్

విడుదల తేది: 25/08/2022

ఎప్పుడో కరోనాకి ముందు "వరల్డ్ ఫేమస్ లవర్" సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ చాలా కాలం తరువాత ఇప్పుడు "లైగర్" సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చారు. విజయ్ దేవరకొండ కెరియర్ లో మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా ఆగస్టు 25, 2022 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూసేద్దామా..

కథ:

బాలామణి (రమ్య కృష్ణ) మరియు ఆమె కొడుకు లైగర్ (విజయ్ దేవరకొండ) కరీంనగర్ నివాసులు. లైగర్ మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయ ఛాంపియన్‌గా నిలవాలని బాలామణి కోరిక. అదే లైగర్ కల కూడా. ఈ నేపథ్యంలో తల్లీ కొడుకులిద్దరూ తమ జీవిత ఆశయం కోసం ముంబైకి వెళతారు. ఒక మంచి కోచ్ ఆధ్వర్యంలో లైగర్ శిక్షణ ప్రారంభిస్తాడు కానీ తానియా (అనన్య పాండే)తో ప్రేమలో పడ్డాక కొంత పరధ్యానంలో పడతాడు. మరోవైపు బాలామణి లైగర్ అమ్మాయిలకు దూరంగా ఉండాలని, ప్రేమలో పడొద్దని హెచ్చరిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రధాన జంట మధ్య ఎలాంటి వివాదాలు ఏర్పడ్డాయి? లాస్ వెగాస్‌లో జరిగిన ప్రపంచ MMA ఛాంపియన్‌షిప్ లో లైగార్ గెలిచాడా? జాతీయ ఛాంపియన్ నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన లైగర్ ప్రయాణం లో ఎటువంటి అడ్డంకులు ఏర్పడ్డాయి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడు అని చెప్పుకోవచ్చు. తన పాత్ర కోసం బాడీ బిల్డింగ్ చేసిన విజయ్ అద్భుతమైన నటనను కనబరిచారు. నత్తి ఉన్న పాత్ర అయినప్పటికీ చాలా బాగా నటించి ఆ పాత్రకి ప్రాణం పోశాడు విజయ్ దేవరకొండ. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఆ పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. విజయ్ దేవరకొండ నటన ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. అనన్య పాండే తన పాత్రకి బాగానే న్యాయం చేసినప్పటికీ కొన్ని చోట్ల ఆమె నటన ప్రేక్షకులను ఇరిటేట్ చేసే విధంగా ఉంటుంది. రమ్యకృష్ణ కూడా తన పాత్రలో చాలా బాగా నటించారు కానీ కొన్ని సన్నివేశాలలో మాత్రం ఆమె నటన కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది. రోనిత్ రాయి, అలి, మకరంద్ బాగానే నటించారు. మైక్ టైసన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బావుంది.

సాంకేతిక వర్గం:

దాదాపు అన్ని మాస్ మసాలా సినిమాల లాగానే ఈ సినిమా లో కూడా పెద్ద చెప్పుకోదగ్గ కథ అంటూ ఏమీ లేదు. చాలావరకు సన్నివేశాలు కూడా ప్రెడిక్టబుల్ గానే ఉన్నాయి. ముఖ్యంగా ఎం ఎం ఎ సన్నివేశాలను పూరి జగన్నాథ్ ఆసక్తికరంగా చిత్రీకరించలేకపోవడం ప్రేక్షకులను కొంత నిరాశపరుస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ కొంత పరవాలేదు అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. రెగ్యులర్ కథ అయినప్పటికీ దానిని గ్రిప్పింగ్ గా చెప్పడంలో పూరి జగన్నాథ్ విఫలమయ్యారని చెప్పుకోవాలి. సునీల్ కశ్యప్ సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగానే అనిపించింది. రన్ టైం తక్కువ ఉన్నప్పటికీ సినిమా చాలా ఎక్కువ సేపు ఉన్నట్లు అనిపిస్తుంది.

బలాలు:

విజయ్ దేవరకొండ

మాస్ డైలాగ్స్

రెండు మూడు పాటలు

బలహీనతలు:

సెకండ్ హాఫ్

రమ్యకృష్ణ

కథ ప్రెడిక్టబుల్ గా ఉండడం

హీరోయిన్ ట్రాక్

చివరి మాట:

సినిమా కథ కొంత ఆసక్తికరంగానే మొదలవుతుంది. మొదటి హాఫ్ మొత్తం క్యారెక్టర్ లను ఎస్టాబ్లిష్ చేయడంలో గడుస్తుంది. విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండేల మధ్య ప్రేమ కథ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. చాలావరకు సన్నివేశాలు ప్రేక్షకులు ఊహించినట్టే జరుగుతూ ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా నార్మల్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథ మరింత స్లో అయిపోతుంది. మైక్ టైసన్ పాత్ర అనన్య పాండేను కిడ్నాప్ చేయడం ఆ తర్వాత ఆ క్లైమాక్స్ ఇవన్నీ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తాయి. మైక్ టైసన్ పాత్రని పూర్తిగా వేస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఆఖరి 40 నిమిషాలు ప్రేక్షకులు ఊహించలేనంత చిరాకు తెప్పిస్తాయి. ఓవరాల్ గా లైగర్ ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది అని చెప్పుకోవచ్చు.

బాటమ్ లైన్:

"లైగర్" దారుణంగా బ్యాక్ ఫైర్ అయిన పూరి జగన్నాథ్ స్పోర్ట్స్ డ్రామా.

Tags:    

Similar News