Vaarasudu: 'వారసుడు' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?
Vaarasudu: 'వారసుడు' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?
చిత్రం: వారసుడు
నటీనటులు: విజయ్, రష్మిక మందన్న, ఆర్ శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, యోగి బాబు, జయసుధ, నందిని రాయి, శ్యామ్ తదితరులు
సంగీతం: ఎస్ ఎస్ తమన్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పలని
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా
విడుదల తేది: 14/01/2023
తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ కూడా ఒకరు. అభిమానులు ప్రేమగా ఇళయ తళపతి అని పిలుచుకునే విజయ్ తాజాగా ఇప్పుడు "వారీసు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే సినిమా తెలుగులో "వారసుడు" అనే టైటిల్ తో విడుదలైంది. "మహర్షి" ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విజయ్ కరియర్ లోనే ఇది మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా గా విడుదలైంది. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. చిత్ర తమిళ్ వర్షన్ జనవరి 11న విడుదలైనప్పటికీ ఈ సినిమా తెలుగు వర్షన్ మాత్రం ఇవాళ అనగా జనవరి 14 న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూసేద్దామా..
కథ:
రాజేంద్రన్ (ఆర్ శరత్ కుమార్) ఇండియాలో ఉన్న అతిపెద్ద బిజినెస్ మాన్లలో ఒకరు. అతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒకళ్ళు జై (శ్రీ కాంత్) మరొకరు అజయ్ (శ్యామ్). ఒకరోజు రాజేంద్రన్ కి పాంక్రియాటిక్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో రాజేంద్రన్ మూడవ కొడుకు విజయ్ రాజేంద్రన్ (విజయ్) ఏడేళ్ల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. ఫామిలీ బిజినెస్ కి సంబంధించి తన తండ్రితో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిన విజయ్ మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు? తిరిగి వచ్చాక తన ఇంటి పరిస్థితిని ఎలా మార్చాడు? తన తండ్రి బిజినెస్ కి విజయ్ వారసుడయ్యాడా? జయప్రకాశ్ (ప్రకాష్ రాజ్) మరియు ముఖేష్ (గణేష్ వెంకట్ రామన్) ఎందుకు రాజేంద్రన్ కుటుంబానికి హాని తలపెట్టాలని అనుకుంటున్నారు? విజయ్ తన కుటుంబాన్ని కాపాడగలిగాడా? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
నటీనటులు:
విజయ్ నటన ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమా మొత్తాన్ని విజయ్ తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. తన పాత్రలో పూర్తిస్థాయిలో ఒదిగిపోయి ప్రేక్షకులను చాలా బాగా అలరించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో కూడా విజయ్ నటన ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. రష్మిక కి పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర ఏమి ఉండదు. కేవలం పాటలకు మరియు రెండు మూడు సన్నివేశాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ రష్మిక నటన కూడా బాగానే అనిపిస్తుంది. జయసుధ నటన సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్. ఆమె తెరపై ఉన్నంతసేపు సినిమా చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ఆర్ శరత్ కుమార్ కూడా తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా నడిచారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం:
తమన్ సంగీతం ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని తమన్ బీజీఎం చాలా బాగా ఎలివేట్ చేసింది. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. పెద్ద చెప్పుకోదగ్గ కథ ఏమీ లేకపోయినప్పటికీ వంశీ పైడిపల్లి సినిమాని చాలా వరకు కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ తోనే ముందుకు తీసుకువెళ్లారు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అయితే చాలా వరకు సన్నివేశాలు ఇప్పటికే చాలా వరకు సూపర్ హిట్ తెలుగు సినిమాలలో చూసేసినట్లు అనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ సినిమాకి మంచి కలర్ ఫుల్ మరియు బ్రైట్ విజువల్స్ ను అందించారు. ఎడిటింగ్ పరవాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లోని కొన్ని సాగతీత సన్నివేశాలను ఎడిట్ చేసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
బలాలు:
విజయ్ నటన
కామెడీ
ఎంటర్టైన్మెంట్
ఫ్యామిలీ సెంటిమెంట్
సంగీతం
బలహీనతలు:
ప్రేడిక్టబుల్ కథ
సెకండ్ హాఫ్
తమిళ్ నేటివిటీ
చివరి మాట:
సినిమా చాలా గ్రాండ్ గా మొదలవుతుంది. మొదట్లోనే సినిమాలోని పాత్రలను ఇంట్రడ్యూస్ చేసేస్తారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ కి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. చాలావరకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ తో చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ పర్వాలేదు అనిపిస్తుంది. విజయ్ అభిమానులకు మాత్రం ఈ ఇంటర్వెల్ సీన్ బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా గడుస్తుంది కానీ సెకండ్ హాఫ్ చాలా లెంతీగా అనిపిస్తుంది. చాలావరకు సన్నివేశాలను డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది. ఒక రెండు మూడు ఎంటర్టైనింగ్ సన్నివేశాలు తప్ప సెకండ్ హాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఓవర్ ఆల్ గా ఈ సినిమా విజయ్ అభిమానులకు మాత్రం కనుల పండుగ అని చెప్పుకోవచ్చు.
బాటమ్ లైన్:
"వారసుడు" తమిళ్ ప్రేక్షకులకు మరియు విజయ అభిమానులకు మాత్రమే నచ్చే ఒక ఎంటర్టైనింగ్ ప్రెడిక్టబుల్ కథ.