Michael Movie Review: మైఖేల్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
Michael Movie Review: మైఖేల్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: మైఖేల్
నటీనటులు: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యంశ కౌశిక్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసూయ భరద్వాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, రవి వర్మ తదితరులు
సంగీతం: సామ్ సీ ఎస్
సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్
నిర్మాతలు: భరత్ చౌదరి, పుష్కర్ రామ్, మోహన్ రావు,
దర్శకత్వం: రంజిత్ జయకొడి
బ్యానర్లు: కరణ్ సీ ప్రొడక్షన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్
విడుదల తేది: 03/02/2023
ఎప్పుడో 2021లో "గల్లీ రౌడీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన యువ హీరో సందీప్ కిషన్ ఇన్నాళ్లకు మళ్ళీ "మైఖేల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెలుగులో మాత్రమే కాక తమిళ్లో కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో ఇవాళ అనగా ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్ భాషల్లో మాత్రమే కాక హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. రంజిత్ జయ కోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుందో చూసేద్దామా..
కథ:
మైఖేల్ (సందీప్ కిషన్) అనే యువకుడు ముంబైలోని ఒక గ్యాంగ్ స్టార్ దగ్గర పెరుగుతాడు. చిన్నప్పటి నుంచి గ్యాంగ్ స్టార్ ల మధ్యలోనే పెరిగిన మైఖేల్ కు జీవితంలో కేవలం ఒకే ఒక్క లక్ష్యం ఉంటుంది. ఎప్పుడూ తన లక్ష్యాన్ని చేధించాలని మైఖేల్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతకీ మైఖేల్ లక్ష్యం ఏంటి? ఎవరికీ తెలియకుండా అసలు మైఖేల్ దాస్తున్న తన గతం ఏంటి? మైఖేల్ తన లక్ష్యాన్ని సాధించగలిగాడా? ఈ విషయంలో ఎవరు తనకి సహాయం చేశారు? ఎవరి వల్ల అడ్డంకులు ఎదుర్కొన్నాడు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
నటీనటులు:
మిగతా సినిమాలతో పోలిస్తే సందీప్ కిషన్ ఈ సినిమాలో చాలా విభిన్న పాత్రలో కనిపించారు. అంతేకాకుండా తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. సిక్స్ ప్యాక్ లుక్ తో అదరగొట్టిన సందీప్ కిషన్ నటన పరంగా కూడా తన పాత్రను ఒదిగిపోయి చాలా బాగా నటించారు. విజయ్ సేతుపతి తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ నటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వరుణ్ సందేశ్ కూడా నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నారు. అనసూయ భరద్వాజ్ పాత్రలో పెద్ద కొత్తదనం ఏమీ ఉండదు కానీ ఆమె కూడా బాగానే నటించింది అని చెప్పవచ్చు. గౌతమ్ మీనన్ కు సినిమాలో చాలా మంచి పాత్ర దక్కింది కానీ గౌతమ్ ఆ పాత్రకు అంతగా సెట్ అవ్వలేదు. సినిమాలో చాలామంది స్టార్ నటీనటులు ఉన్నారు కానీ వారికి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలను రాసుకోవడంలో డైరెక్టర్ విఫలమయ్యారని చెప్పుకోవాలి. ముఖ్యంగా విజయ్ సేతుపతి పాత్రకు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఫాన్స్ ను కొంత నిరాశ పరుస్తుంది.
సాంకేతిక వర్గం:
చాలావరకు డార్క్ క్రైమ్ డ్రామాస్ లో ఉండే థీమ్ మరియు ఎలిమెంట్లను మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఈ సినిమాలో డైరెక్టర్ రంజిత్ జయ కోడి ప్రజెంట్ చేశారని చెప్పుకోవాలి. రొటీన్ సన్నివేశాలను కూడా మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా సినిమాని బాగానే తెరకెక్కించారు డైరెక్టర్. కానీ సినిమా కథ చాలా వీక్ గా ఉండటం సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ సినిమాకి ప్లస్ పాయింట్ గానే చెప్పవచ్చు. చాలా వరకు స్టైలిష్ లుక్స్ తో సినిమా సెట్ అప్ ని సినిమాటోగ్రాఫర్ బాగా చూపించారు. నేపథ్య సంగీతం సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ఎడిటింగ్ ఏమాత్రం బాగోలేదని చెప్పుకోవచ్చు.
బలాలు:
సందీప్ కిషన్ స్టైలిష్ నటన
నేపథ్య సంగీతం
విజువల్స్
బలహీనతలు:
ఆసక్తికరమైన కథ లేకపోవడం
గౌతమ్ మీనన్ నటన
నెరేషన్ చాలా స్లోగా ఉండటం
ఏమాత్రం ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
చివరి మాట:
ఈమధ్య కాలంలో తన స్టోరీ సెలక్షన్ విషయంలో సందీప్ కిషన్ ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు బాగానే ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో మాత్రం కేవలం పరవాలేదు అనిపిస్తారు. ఒక గుండా మైఖేల్ కథను నెరేట్ చేస్తూ ఉండడం తో సినిమా మొదలవుతుంది. మొదటి 30 నిమిషాలు మైఖేల్ కథను అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. అప్పటినుంచి సినిమా చాలా స్లోగా నడవడం మొదలవుతుంది. సినిమా కథ మరియు ఎమోషన్స్ మీద డైరెక్టర్ ఎక్కువ వర్క్ చేసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సినిమా మొత్తం చాలా డార్క్ థీమ్ తో నడుస్తుంది. ఓవరాల్ గా అలాంటి డార్క్ థీమ్ ఉండే గ్యాంగ్ స్టార్ సినిమా లు నచ్చేవాళ్లకు ఈ సినిమా కూడా నచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
బాటమ్ లైన్:
మంచి విజువల్స్ మరియు సాంకేతిక పనితనం ఉన్నప్పటికీ "మైఖేల్" 90స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతూ ఒక రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామా గా నిలిచింది.