భామగా బామ్మగారి సందడి!

Update: 2019-07-05 08:34 GMT

సమంత పెళ్లి తరువాత తనలోని మరో కోణాన్ని చూపిస్తోంది ప్రేక్షకులకు. చక్కని పాత్రలు.. దానికి తగ్గ నటనతో ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతోంది. అక్కినేని సమంతగా నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించగలిగే అవకాశం ఉన్న పాత్రలనే ఎన్నుకుంటూ.. తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. ఇపుడు ఆ కోవలోనే మరో సినిమా వచ్చింది. ఓ బేబీ.. 70 ఏళ్ల బామ్మ ఒక్కసారిగా పడుచు పిల్లగా మారిపోతే ఏం జరుగుతుంది? అదే లైన్ తో చేసిన సినిమా ఇది. అలా మొదలు పెట్టిన దర్శకురాలు నందినీ రెడ్డి కొంత గ్యాప్ తరువాత చేసిన చిత్రం ఇది. ఇక తనదైన స్టైల్ లో టీజర్ లు , ప్రోమోలు, ట్రైలర్లు వైవిధ్యంగా వదిలి సినిమా పై అంచనాల్ని పెంచేసిన నందినీ రెడ్డి సినిమాని కూడా అదేస్థాయిలో మలిచారా? సినిమా సమంతకు ఎంత వరకూ ప్లస్ అవుతుంది? ఈరోజు విడుదలైన ఓ బేబీ సినిమా తీరుపై ఓ లుక్కేద్దాం రండి.

కథ అంటూ ఎంతో లేదు. ముందే చెప్పినట్టు చిన్న లైన్.. ఒక బామ్మ గారు యువతిగా మారిపోతే ఏం జరుగుతుంది. ఇంతే. ఇది కొరియన్ సినిమా మిస్ గ్రానీ సినిమా లైన్. దీనిని తెలుగుదనంతో చుట్టేసి.. కథనాన్ని నడిపించడమే ఈ సినిమా. చాదస్తపు బామ్మ తన చాదస్తంతో ఇంటిల్లిపాదినీ ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ క్రమంలో తన కోడలుకు గుండె నొప్పి వస్తుంది. దానికి కారణం తానే అనే భ్రమతో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది బామ్మ. అలా వెళ్ళిపోయి.. ఇలా పడుచు పిల్లలా ప్రత్యక్షం అయిపోతుంది. అసలు బామ్మ ఎలా పడుచు పిల్ల అయింది? తిరిగొచ్చి కుటుంబంతో ఎలా కలిసింది. కలిసి ఏం చేసింది? అన్నిటికన్నా.. బామ్మే ఈ పడుచు భామ అని తెలిసిన తరువాత బామ్మ కొడుకు పరిస్థితి ఏమిటీ? ఇవన్నీ వెండితెరపై చూడాల్సిందే!

ఇలా ఉంది..

చద్దన్నంలో ఆవకాయ కలుపుకుతిన్నంత హాయిగా ఉంది సినిమా. పెద్దల పట్ల పిల్లల బాధ్యతల్ని.. వయసుతో పాటు పిల్లలపై పెరిగే ప్రేమ మాధుర్యాన్ని చాదస్తంగా ఎలా పిల్లలు భావిస్తారనే అంశాన్ని.. పిల్లలకు భారంగా మారిపోతున్నామనుకునే పెద్దలకు ఈ తరంతో సర్దుకుపోతే ఎంత బావుంటుందో చెప్పే సున్నిత భావాన్ని కలగలిపి వినోదాత్మకంగా.. గుండెల్ని పిండేసే సన్నివేశాలతో.. చెప్పిన సినిమా ఇది. సినిమాని భాగాలుగా చూడటం అలవాటయిన మన భాషలో చెప్పాలంటే.. మనకి వినోదాన్నిచ్చే భాగం ఒకటి.. మన సెంటిమెంట్ ను విప్పి చూపించే భాగం ఇంకోటి. అందుకే సహజంగానే వినోదాత్మక భాగం వేగంగా కదిలిపోతుంది. సెంటిమెంట్ కొంచెం భారంగా సాగుతుంది. అంతే. మొట్టమ్మీద సినిమా ఆలోచింప చేస్తుంది.

ఎలా చేశారు..

సినిమా మొత్తం సమంతానే! డబ్భై ఏళ్ల చాదస్తాన్ని 23 ఏళ్ల పడుచు చూపించాలంటే సాధ్యమా? అది చేసి చూపించింది సామంత తన భుజాల మీద సినిమాని నడిపించింది. బామ్మ నడక..ఆహార్యం ఇలా ప్రతి అంశాన్నీ తన నటనలో చక్కగా ప్రతిబింబింప చేసింది. పూర్తి మార్కులు కొట్టేసింది. ఇక బామ్మగా లక్ష్మి నటన ఆకట్టుకుంది. రాజేంద్రప్రసాద్ కూడా చంటి పాత్రలో సమంత తో పాటే నవ్విస్తూ సాగాడు. రావు ర‌మేష్‌, నాగ‌శౌర్య‌, ప్రగ‌తి, ఊర్వశి, ఐశ్వర్య‌, తేజ అందరూ సినిమాలో బాగా చేశారు. జగపతి బాబు, అడివి శేషు చిన్న పాత్రల్లో మెరిసి మురిపిస్తారు.

టెక్నికల్ గా..

సినిమాకి ఫోటోగ్రఫీ బాగా కుదిరింది. సంగీతం గురించి చెప్పుకోవాలంటే.. మిక్కీజీ మేయర్ పాటలు ఆకట్టుకోలేదనే చెప్పాలి. కానీ, నేపథ్య సంగీతంతో మేజిక్ చేశాడు. ఇక మాటలు చాలా బావున్నాయి. అన్నిటికీ మించి దర్శకత్వ ప్రతిభ చెప్పుకోవాలి. సున్నితమైన కథని తెరకెక్కించడంలో ఎక్కడా తడబాటు లేకుండా మంచి అవుట్ పుట్ తీసుకు రావడంలో నందినీ రెడ్డి పూర్తిగా విజయవంతం అయింది. మొత్తమ్మీద చక్కని కుటుంబ విలువల నేపథ్య సినిమా చాన్నాళ్ళ తరువాత.. 

Tags:    

Similar News