Bangarraju Review: 'బంగార్రాజు'.. మూవీ రివ్యూ..
ఈ మధ్యనే "వైల్డ్ డాగ్" సినిమాతో పర్వాలేదనిపించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు "బంగార్రాజు" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
చిత్రం: బంగార్రాజు
నటీనటులు: నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: జే యువరాజ్
నిర్మాత: అక్కినేని నాగార్జున
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
విడుదల తేది: 14/01/2021
ఈ మధ్యనే "వైల్డ్ డాగ్" సినిమాతో పర్వాలేదనిపించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు "బంగార్రాజు" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సూపర్ హిట్ సినిమా "సోగ్గాడే చిన్ని నాయన" చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా నాగార్జున సరసన మళ్లీ రమ్యకృష్ణ కనిపించనున్నారు. టీజర్ మరియు ట్రైలర్ లతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం తాజాగా ఇవాళ సంక్రాంతి సందర్భంగా జనవరి 14, 2022 న విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో చూసేద్దామా..
కథ:
"సోగ్గాడే చిన్నినాయన" సినిమా ఎక్కడ ముగిసిందో బంగార్రాజు సినిమా మళ్లీ అక్కడే మొదలవుతుంది. బంగార్రాజు ఆత్మ స్వర్గానికి వెళ్లిపోగా తన మనవడు చిన్న బంగార్రాజు (నాగ చైతన్య) శివపురం ఊర్లో నివసిస్తూ ఉంటాడు. ఊర్లో తనకి ప్లేబోయ్ అనే పేరు కూడా ఉంది. కానీ ఆ ఊరికి సర్పంచ్ గా వచ్చిన నాగలక్ష్మి (కృతి శెట్టి)ను చిన్న బంగార్రాజు ప్రేమలో పడేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ అవి విఫలం అవుతూ ఉంటాయి. మరోవైపు శివపురం గుడి నిధి కొందరు దుండగులు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారికి చిన్న బంగార్రాజు అడ్డు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మళ్లీ భూలోకానికి తిరిగివచ్చి బంగార్రాజు ఆత్మ చిన్న బంగార్రాజు కి ఏ విధంగా సహాయ పడ్డాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు:
బంగార్రాజు పాత్రలో నాగార్జున మరొకసారి అందరి దృష్టిని ఆకర్షించారు. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశారు అని చెప్పుకోవచ్చు. తన పాత్రకి మళ్లీ పూర్తి స్థాయిలో న్యాయం చేశారు నాగార్జున. కెరీర్ లో మొట్టమొదటి సారిగా ఇలాంటి మాస్ పాత్రలో కనిపించారు నాగచైతన్య. మొదటిసారి అయినప్పటికీ తన పాత్రలో ఒదిగిపోయి చక్కటి పర్ఫామెన్స్ ను పండించారు. కృతి శెట్టి కూడా సరికొత్త పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అందంతో మాత్రమే కాక అభినయంతో కూడా మంచి మార్కులు వేయించుకుంది. రమ్యకృష్ణ పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. రావు రమేష్ కూడా తన పాత్రలో బాగానే నటించారు. బ్రహ్మాజీ మరియు వెన్నెల కిషోర్ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతికవర్గం:
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం బాగానే ఉన్నప్పటికీ బంగార్రాజు మరియు సోగ్గాడే చిన్నినాయన సినిమా కి మధ్య కంపారిజన్ కచ్చితంగా వస్తుంది. ఈ రెండు సినిమాల మధ్య బాగా బాగా సిమిలారిటీ ఉండటం సినిమాకి కొంచెం మైనస్ అయింది. కథ కూడా చాలా రొటీన్ గా చిన్న చిన్న ట్విస్టులతో సాగడం ప్రేక్షకులను కొంచెం బోర్ కొట్టిస్తోంది. కథ విషయంలో కళ్యాణ్ కృష్ణ మరి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సంగీతం అనూప్ రూబెన్స్ సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. పాటలు యావరేజ్ గా ఉన్నప్పటికీ విజువల్స్ బాగా ఉండటం సినిమాకి కొంచెం ప్లస్ అయ్యింది. నేపథ్య సంగీతం బాగానే అనిపించింది. సినిమాటోగ్రాఫర్ పనితనం సినిమాకి చాలా పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది.
బలాలు:
నటీనటులు
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
పల్లెటూరి వాతావరణం
బలహీనతలు:
సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు
రొటీన్ కథ
కామెడీ అంతగా పండకపోవడం
చివరి మాట:
సోగ్గాడే చిన్నినాయన సినిమా ముగిసిన చోటే బంగార్రాజు కథ మొదలవుతుంది. వచ్చినప్పటికీ ఫస్టాఫ్ కొంచెం పర్వాలేదు అనిపించినప్పటికీ సెకండాఫ్ మాత్రం చాలా స్లో గా అనిపిస్తుంది. కామెడీ కి బాగా స్కోప్ ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో కామెడీ అసలు పండలేదు అని చెప్పచ్చు. అయితే ఓవరాల్ గా సినిమా పర్వాలేదు అనిపిస్తుంది.
బాటమ్ లైన్:
రొటీన్ కథ అయినప్పటికీ మళ్లీ అదే మ్యాజిక్ తో మన ముందుకు వచ్చిన "బంగార్రాజు".