థ్రిల్లింగ్ 'గేమ్ ఓవర్'

Update: 2019-06-14 07:29 GMT

తాప్సీ ఇటీవలి కాలంలో ప్రత్యేకతతో కూడిన కథలతో ముందుకు వస్తున్న హీరోయిన్. తెలుగులో వెండితెరకు పరిచయమైనా.. ఇక్కడ సక్సెస్ లేక బాలీవుడ్ మెట్లెక్కింది. అక్కడ బేబీ, పింక్, వంటి స్పెషల్ మూవీస్ తో తానెంతో రుజువు చేసుకుంది. ఈ సినిమాలు సౌత్ లో కూడా బాగా ఆడాయి. దీంతో తెలుగులో ఆనందో బ్రహ్మ సినిమా చేసింది. అదే కోవలో ఇపుడు గేమ్ ఓవర్ చేసింది. ఇది కూడా పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ సినిమానే. నయనతార ప్రధాన పాత్రలో మాయ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్‌ శరవణన్‌.. గేమ్‌ ఓవర్‌ను తెరకెక్కించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాతో సౌత్‌లోనూ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నారు తాప్సీ. మరి గేమ్‌ ఓవర్‌ తాప్సీకి సౌత్ లో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందా?

ఇదీ కథ..

అమృత (సంచన నటరాజన్‌) అనే అమ్మాయిని ఓ హంతకుడు కిరాతకంగా చంపే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. అమృతను తాళ్లతో కట్టేసిన తన ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ తొడిగి ఊపిరాడకుండా చేసిన హంతకుడు తరువాత ఆమె బాడీని నరికి తగులబెడతాడు. స్వప్న (తాప్సీ పన్ను) వీడియో గేమ్ డిజైనర్‌. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ సమస్య కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసి గాయపడుతుంది. ఈ సంఘటన తరువాత పరిణామాలు స్వప్న జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? స్వప్న జీవితంతో అమృతకి సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ.

ఎలావుంటుంది..

ఇది ఒక థ్రిల్లర్ సినిమా.. పేరుకు తగ్గట్టుగానే సినిమా అంతా ఓ వీడియో గేమ్ లా సాగిపోతుంది. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. దాంతో సినిమా నిడివి కోసం మొదటి భాగం కొద్దిగా సాగాదీతలా అనిపిస్తుంది. అసలు సినిమా ద్వితీయార్థంలోనే ఉంటుంది. సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో పాటు పారానార్మల్‌, హర్రర్‌ ఎలిమెంట్స్‌ను కూడా చొప్పించడంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. అనవసరమైన పాటలూ, కామెడీ లాంటివి ఏం లేకుండా సూటిగా సినిమా గమనం ఉండడం రిలీఫ్ ఇస్తుంది. చిన్న విషయాన్ని చెప్పెక్రమంలో ప్రేక్షకుడికి థ్రిల్ కలిగించడానికి అనవసర ప్రయత్నాలు కూడా చేయకపోవడం కొంత నయమనిపించింది. పాయింట్ చుట్టూ చిక్కని స్క్రీన్ ప్లేని అల్లుకుని దాని పరిధిలో థ్రిల్ కలిగించేలా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. సినిమాకి ఫోటోగ్రఫీ ప్రాణం పోసింది. వినోద్‌ కెమెరా వర్క్‌, రాన్ ఏతాన్ యోహన్ మ్యూజిక్‌ పెద్ద మ్యాజిక్ చేశాయి. ఇక దర్శకుడు శ్విన్‌ శరవణన్‌, రచయిత కావ్య ప్రత్యేకమైన సినిమాగా గేమ్ ఓవర్ ను నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం ప్రతి ఫ్రేం లోనూ కనిపించింది.

ఎవరెలా చేశారంటే..

సినిమా మొత్తం తాప్సీనే మోసింది. అద్భుతమైన ఎమోషన్స్ పలికించిన తాప్సీ సినిమాలో ఉన్న చిన్న చిన్న లోపాల్ని కనిపించకుండా చేసిందని చెప్పొచ్చు. లుక్ పరంగా కూడా తాప్సీ చాలా బావుంది. సౌత్లో ఇకపై హీరోయిన్ ఓరియంటెడ్‌ సినిమాలు చేయాలంటే తానూ ఓ పెద్ద ఆప్షన్ అనిపించేలా చేసింది. ఇక మరో కీలక పాత్రలో నటించిన వినోదిని వైద్యనాథన్‌ కలమ్మ పాత్రకు సరిగ్గా సరిపోయారు. ఇతర పాత్రల్లో అనీష్‌ కురివిల్లా, రమ్య సుబ్రమణ్యం, సంచన నటరాజన్‌ మెప్పించారు.

చివరగా.. థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులకు గేమ్ ఓవర్ సినిమా మంచి కానుకే. 

Tags:    

Similar News