Sitting On Chair: కుర్చీలో గంటల తరబడి కూర్చుంటున్నారా.. ఆయుష్షు తగ్గించుకున్నట్లే..!
Sitting On Chair: నేటి రోజుల్లో కుర్చీలో గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాలు పెరిగాయి. దీంతో చాలామందికి శారీరక శ్రమ తగ్గి స్థూలకాయులుగా మారుతున్నారు.
Sitting On Chair: నేటి రోజుల్లో కుర్చీలో గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాలు పెరిగాయి. దీంతో చాలామందికి శారీరక శ్రమ తగ్గి స్థూలకాయులుగా మారుతున్నారు. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం వల్ల అకాల మరణ ముప్పు పెరుగుతుందని ఇటీవల ఒక పరిశోధన వెల్లడించింది. మరొక విషయం ఏంటంటే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ ఎక్కువసేపు కూర్చోవడం ప్రమాదకరం అని తేలింది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి, వాటిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు, జీవక్రియ బలహీనమవుతుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.
మనిషి బరువు పెరగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కొవ్వును విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ లైపోప్రొటీన్ లైపేస్ నెమ్మదిగా పని చేస్తుంది. దీని కారణంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా ట్రైగ్లిజరైడ్స్, బ్లడ్ షుగర్ పెరుగుతాయి దీనివల్ల ఇన్సులిన్ బ్యాలెన్స్ చెదిరిపోతుంది. ఇది శరీరంలో మధుమేహానికి కారణం అవుతుంది. అందువల్ల ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి కనీసం 3 నుంచి 5 నిమిషాలు చుట్టూ తిరగాలి.
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల కండరాలపై చెడు ప్రభావం పడుతుంది. దీని కారణంగా కండరాలలో స్టోర్ అయిన ప్రోటీన్ విరిగిపోయే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల కండరాల నష్టంతో పాటు బలం కూడా తగ్గుతుంది. అందువల్ల ప్రతిసారీ కుర్చీలో నుంచి లేచి కండరాలను సాగదీయాలి. వారానికి రెండు మూడు సార్లు కండరాల ఎక్సర్‌సైజ్ చేయాలి. తొమ్మిది నుంచి పది గంటల పాటు ఆఫీసులో కూర్చొని పనిచేసేవారిలో చాలామందికి వెన్ను, మెడ నొప్పులు వస్తుంటాయి. ఇవి చిన్న సమస్యలే అయినప్పటికీ జీవితకాల బాధను అందిస్తాయి.
ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నుపూసలోని ఇంటర్వర్‌టెబ్రల్ డిస్క్‌లు, కీళ్లు, లిగమెంట్లు, కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది వెన్ను, మెడ నొప్పికి కారణమవుతుంది. అందువల్ల ప్రతి 30 నిమిషాలకు, మెడను ఎడమ, కుడి వైపునకు తిప్పాలి. ఒకే చోట కూర్చోవడం వల్ల గుండె ధమనులు గట్టిపడతాయి. శరీరంలో రక్త ప్రసరణ దెబ్బతింటుంది. కాబట్టి వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.