Air Pollution: వాయు కాలుష్యంతో ఆ సమస్య కూడా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు
Skin care problems due to Air Pollution: ప్రస్తుతం వాయు కాలుష్యం ప్రపంచాన్ని భయపెడుతోంది. మరీ ముఖ్యంగా భారత్‌లో వాయు కాలుష్యం రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఢిల్లీతో పాటు పలు పట్టణాల్లో వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది. సాధారణంగా వాయు కాలుష్యం వల్ల శ్వాస సంబంధిత సమస్యలతో పాటు కంటి సమస్యలు వస్తాయని చాలా మంది భావిస్తుంటాం. అయితే వాయు కాలుష్యం కారణంగా మరో ప్రమాదం కూడా పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.
విషపూరితమైన గాలిని పీల్చడం రోజుకు 12 సిగరెట్లు తాగడానికి సమానం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మీ ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది. అనేక ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. వాయు కాలుష్యం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం వాయు కాలుష్యానికి ఎక్స్‌పోజ్ అయ్యే వారిలో చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా చర్మంపై ముడతలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారడంతోపాటు పగుళ్లు వంటి లక్షణాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాయు కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే కొన్ని రకాల చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి కొబ్బరి నూనె, మంచి మాయిశ్చరైజర్ క్రీమ్‌లను చర్మానికి రెగ్యులర్‌గా అప్లై చేసుకోవాలి. అలాగే స్నానం చేసే సమయంలో మరీ వేడి నీటిని తీసుకోకూడదు. దీనివల్ల చర్మం డ్రైగా మారే అవకాశాలు ఉంటాయి. చర్మం నిత్యం హైడ్రేట్‌గా ఉండడానికి పుష్కలంగా నీరు తాగాలి. బయటకు వెళ్లే ముందు కచ్చితంగా చర్మాన్ని స్కార్ఫ్‌తో కవర్ చేసుకోవాలి. ఇక తీసుకునే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.