Back Pain - Heart Attack: వెన్ను నొప్పి కూడా గుండెపోటు లక్షణమా? నిపుణులు ఏమంటున్నారంటే..
Is back pain a symptom of heart attack: మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా భారత్‌లో గుండె సమస్యలు ఎక్కువుతున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు కూడా గుండెపోటుతో మరణించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కొన్ని లక్షణాల ఆధారంగా గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు.
గుండెపోటును ముందుగానే గుర్తించి వైద్యుల సూచనలు పాటిస్తే మరణం సంభవించడాన్ని ఆపొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి గుండె పోటుకు ముందస్తు లక్షణమని మనందరికీ తెలిసిందే. అయితే వెన్ను నొప్పి కూడా గుండెపోటుకు ప్రాథమిక లక్షణమని మీకు తెలుసా? ఇందులో నిజమెంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్నునొప్పి, గుండెపోటుకు మధ్య సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. గుడ్‌గావ్‌లోని షెల్బీ సానర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు చెందిన కార్డియాలజీ విభాగం నిపుణులు వెన్నునొప్పికి, గుండెపోటుకు మధ్య ఉన్న సంబంధాలపై పరిశోధనలు చేపట్టారు. ముఖ్యంగా వెన్ను పై భాగంలో నొప్పి ఉంటే.. అది కూడా దీర్ఘకాలంగా ఈ సమస్య వెంటాడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు. గుండె చుట్టూ ఉన్న సిరల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఛాతీ మధ్యలో నొప్పిగా ఉండడం, మంట కలుగుతున్న భావన కలిగినట్లయితే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఎడమ చేతిలో నొప్పి దీర్ఘకాలంగా ఉన్నట్లయితే వెంటనే అలర్ట్ అవ్వాలి. దీర్ఘకాలికంగా భరించలేని నొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఇవేకాకుండా ఎలాంటి పని చేయకపోయినా.. చెమటలు రావడం, అలసిపోవడం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్లను కలవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించడమే మంచిది.