Moringa Leaves: మునగాకుతో ఎన్నో ప్రయోజనాలు.. అస్సలు మిస్ కావొద్దు..
Moringa Leaves Benefits: పుష్కలమైన విటమిన్లు, మినెరల్స్ ఉన్న ఆకుల్లో మునగాకు ఒకటి. వీటి ప్రయోజనాలు గురించి తెలియని వాళ్లైతే అంతగా పట్టించుకోరు.
Moringa Leaves Benefits: పుష్కలమైన విటమిన్లు, మినెరల్స్ ఉన్న ఆకుల్లో మునగాకు ఒకటి. వీటి ప్రయోజనాలు గురించి తెలియని వాళ్లైతే అంతగా పట్టించుకోరు. కానీ తెలిసిన వాళ్లైతే వాటిని అస్సలు వదులుకోరని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇది ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మంచి టేస్టీగా ఉంటుందంటున్నారు. సాంబారు అనగానే ముందుగా గుర్తొచ్చేది మునక్కాయ. అది ఉంటే ఆ టేస్టే వేరు. కొందరు మునగ చెట్టు ఆకులను కర్రీలో వినియోగిస్తుంటారు. కానీ మునగ ఆకుల ప్రయోజనం తెలిస్తే మాత్రం అందరూ వాటి వినియోగాన్ని మొదలుపెట్టడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మునగకాయలు, మునగ ఆకుల్లో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మునగాకు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు. ఇవి జీవక్రియను పెంచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో మునగ ఆకు నీటిని లేదా రసం తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం, రక్తహీనత, కీళ్లనొప్పులు, థైరాయిడ్, ఉబ్బసం, బలహీనత, మధుమేహం, బరువు కోల్పోవడం వంటి ఆరోగ్య సమస్యలకు మునగ ఆకులు ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు మునగాకును తీసుకోవడం వల్ల బాలింతల్లో తల్లిపాల ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నారు.
మునగ ఆకులు శరీరంలో కొవ్వు కణాల నియంత్రణకు తోడ్పడుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు మునగ ఆకులు ఆకలిని కూడా నియంత్రించి అధిక బరువు పెరగకుండా కాపాడుతాయని తేల్చారు. అంటే బరువు తగ్గాలనుకునే వారికి మునగ ఆకు మంచి చాయిస్ అని చెప్పొచ్చు. మునగ ఆకుల్లో కాల్షియం, ఫాస్పరస్ ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు తోడ్పడతాయి. తరచూ మునగ ఆకులను తీసుకునేవారు వృద్ధాప్యంలో ఎముకలు బలహీనపడే ఆస్టియో పోరోసిస్ సమస్య నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మునగాకులో క్యారెట్ కంటే పది రెట్లు ఎక్కువ విటమిన్ ఎ ఉంటుంది. పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పోటాషియం, పెరుగు కంటే 25 రెట్లు ఎక్కువ ఐరన్, 9 రెట్లు ఎక్కువ ప్రోటీన్లను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మునగాకు కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచి ఫలితాలే ఇస్తుందంటున్నారు నిపుణులు. మెరిసే, కాంతివంతమైన చర్మాన్ని అందించడంలో మునగాకు ఎన్నో ప్రయోజాలు అందిస్తుందని చెబుతున్నారు. జుట్టుకు కూడా మంచిదని అంటున్నారు. ముల్తానీ మట్టి చర్మ ప్రయోజనాలు అందించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. దీనిని మునగాకు పొడితో కలిపితే దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయంటున్నారు. టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిలో కొన్ని రోజ్ వాటర్, మునగాకు పొడివేసి కలిపి ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై ఉన్న మలినాలు, మురికిని తొలగిస్తుంది. దీనివల్ల మెరిసే, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చని చెబుతున్నారు.
నోట్: ఈ వివరాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా లభించిన సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.