Millets Production: పెరుగుతున్న చిరుధాన్యాల వినియోగం.. కారణాలు ఇవే..!
Millets Production: ఆధునిక కాలంలో జీవనవిధానం మారడం వల్ల ఆహార పద్దతలు కూడా మారిపోయాయి. ఒకప్పుడు దేశంలో చిరుధాన్యాలను మాత్రమే ఆహారంగా తీసుకునేవారు.
Millets Production: ఆధునిక కాలంలో జీవనవిధానం మారడం వల్ల ఆహార పద్దతలు కూడా మారిపోయాయి. ఒకప్పుడు దేశంలో చిరుధాన్యాలను మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. కానీ నేటికాలంలో అన్నం, రొట్టె ఎక్కువగా తింటున్నారు. అన్నం తింటే రక్తంలో చక్కెర, గోధుమల రొట్టెల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల చాలామంది మధుమేహానికి గురవుతున్నారు. అంతేకాకుండా ఈ ఆహారాల్లో పోషకవిలువలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో వందేళ్లు బతకాల్సిన మనిషి చివరకు అరవై ఏళ్లు కూడా బతకడం లేదు. అందుకే మళ్లీ పాతకాలపు పంటలకు ప్రాముఖ్యం పెరిగింది. వీటి వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
ఆహార పంటలుగా ఉన్న వరి, గోధుమల కంటే రానున్నకాలంలో అధికంగా చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఇవి అధిక దిగుబడినిస్తున్నాయి. వీటి సాగుకు తక్కువ కృత్రిమ ఎరువులు వాడుతుండగా నిర్వహణ భారం ఉండదు. అంతేకాకుండా పుష్కలమైన పోషక విలువలు కలిగి ఉంటాయి. దీంతో గడిచిన మూడేండ్లుగా వీటి వినియోగం పెరుగుతోంది.
భవిష్యత్‌లో 70 శాతం మంది ప్రధాన ఆహారంగా మిల్లెట్లను తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కార్బొహైడ్రేట్లు, అధిక చక్కెరనిచ్చే ఆహార పదార్థాలే ఎక్కువగా ఉండగా క్రమంగా సూక్ష్మపోషకాలు, తక్కువ పిండి పదార్థాలు, అధిక పీచు ఉండే మిల్లెట్ల వైపు జనాలు మొగ్గుచూపుతారని చెబుతున్నారు. వచ్చే దశాబ్ద కాలంలో మిల్లెట్ పంటల సాగును పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ పరిశోధన సంస్థలతోపాటు, భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఆసియా దేశాల్లో సాగవుతున్న మిల్లెట్లలో 80 శాతం పంట ఇండియా నుంచే ఉత్పత్తి అవుతుంది.