Heart Attack: గుండెపోటు వచ్చినప్పుడు ఈ పనిచేస్తే రోగి ప్రాణాలు దక్కుతాయి..!
Heart Attack: గుండెపోటు వచ్చినప్పుడు ఈ పనిచేస్తే రోగి ప్రాణాలు దక్కుతాయి..!
Heart Attack: గత కొన్ని నెలలుగా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. చాలా సందర్భాల్లో రోగి అక్కడికక్కడే మరణిస్తున్నాడు. వైద్యుల ప్రకారం గుండె జబ్బులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు పెద్ద కారణం. గుండె జబ్బులను నివారించడానికి ప్రజలు దాని లక్షణాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. అంతేకాకుండా ఎవరికైనా గుండెపోటు వస్తే రక్షించడానికి ఏం చేయాలో కూడా తెలిసి ఉండాలి.
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆహారం, జీవనశైలిని సరిదిద్దుకోవడం అవసరమని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. కోవిడ్‌తో తీవ్ర అస్వస్థతకు గురైన వారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె పనితీరులో మార్పులు వచ్చాయి. గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. రక్తప్రసరణలో ఒక్కసారిగా ఆటంకం ఏర్పడితే గుండెపోటు సంభవిస్తోంది.
వైద్య నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి, అతని పల్స్ పడిపోతుంటే, గుండెపోటు లేదా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవించినట్లు అర్థం. ఈ పరిస్థితిలో వెంటనే CPR ఇవ్వాలి. CPR అంటే కార్డియోపల్మోనరీ రిససిటేషన్. ఇది వెంటనే చేయడం వల్ల రోగి జీవితాన్ని రక్షించవచ్చు. రోగిని ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి సమయం ఉంటుంది. CPR చేయడం వల్ల రోగి శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం ప్రారంభమవుతుంది.
CPR ఎలా ఇవ్వాలి
ఒక వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు మొదట రెండు చేతులతో అతని ఛాతీని నొక్కాలి. ఈ సమయంలో మీ అరచేతి దిగువ భాగం ఛాతీపై ఉండాలి. ఆపై ఒత్తిడి చేయాలి. దీంతోపాటు రోగికి నోటి ద్వారా శ్వాస అందించవచ్చు. ఇలా చేసిన వెంటనే రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. దీనివల్ల రోగి బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.