డయాబెటీస్ కు సెల్ థెరపీతో చెక్... ఇన్సులిన్, టాబ్లెట్స్ బాధ ఇక లేనట్లేనా?
Diabetes: షుగర్ వ్యాధిని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు నయం చేశారు. సెల్ థెరపీ పద్దతిలో డయాబెటీస్ రోగికి చికిత్స చేశారు.
Diabetes: షుగర్ వ్యాధిని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు నయం చేశారు. సెల్ థెరపీ పద్దతిలో డయాబెటీస్ రోగికి చికిత్స చేశారు. ఈ చికిత్స విజయవంతమైనట్టుగా చైనా షాంఘైలోని చాంగ్జెంగ్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ ఆసుపత్రికి చెందిన సిబ్బంది సెల్ థెరపీ విధానాన్ని డెవలప్ చేశారు. ది సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యూర్ సెల్ సైన్స్ అండర్ ది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, రెంజీ ఆసుపత్రి సంయుక్తంగా 2024 ఏప్రిల్ 30న సెల్ డిస్కవరీ వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించాయి.
చైనా మార్నింగ్ పత్రిక కూడా సెల్ థెరపీపై పరిశోధన వివరాలను ప్రచురించింది. 2021 జూలై లో షుగర్ పేషేంట్ ఒకరికి సెల్ థెరపీ చేశారు. ఈ చికిత్స ప్రారంభించిన 11 వారాల తర్వాత ఆ రోగికి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. షుగర్ మందు బిళ్లలను కూడా వేసుకోవడం మానేశారు.
సెల్ థెరపీ ప్రారంభించిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో రోగి ప్యాంక్రియాటిక్ ఐలెట్ సమర్థంగా పని చేస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ తరువాత రోగి 33 నెలలుగా ఇన్సులిన్ తీసుకోవడం లేదని యెన్ అనే ప్రముఖ రీసెర్చర్ చెప్పారని ఆ పత్రిక కథనం తెలిపింది.
డయాబెటీస్ సెల్ థెరపీ అన్నది అత్యాధునిక చికిత్స అవుతుందని బ్రిటీష్ కొలంబియా యూనివర్శిటీకి చెందిన సెల్యూలర్ ,ఫిజియాజికల్ సైన్సెస్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ టిమోతీ కెఫర్ అభిప్రాయపడ్డారు. ఈ చికిత్స విధానం గణనీయమైన పురోగతిని సూచిస్తుందన్నారు.
దీర్ఘకాలంగా డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నవారి శరీరంలోని పలు అవయవాలపై దీని ప్రభావం ఉంటుంది. డయాబెటీస్ ను నియంత్రించలేకపోతే గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడం కోసం ప్రస్తుతం టాబ్లెట్స్, ఇన్సులిన్ అందుబాటులో ఉన్నాయి.
సెల్ థెరపీ ఎలా చేస్తారు?
ఈ ప్రక్రియలో రోగిలోని పెరిపెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ సెల్స్‌ను సీడ్ సెల్స్ గా రూపాంతరం చెందించారు. దానితోపాటు, ప్యాంక్రియాట్ ఐలెట్ సెల్స్ ను పునర్నిర్మించారు. ఈ విధానంతో శరీరానికి ఎలాంటి నష్టం ఉండదని ఎస్సీఎంపీ రిపోర్ట్ తెలిపింది.
చైనాలో పెరుగుతున్న డయాబెటీస్ కేసులు
ప్రపంచంలో డయాబెటీస్ ఉన్నవారిలో ఎక్కువగా చైనాలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ నివేదిక ఆధారంగా చైనాలో 140 మిలియన్ల మందికి డయాబెటీస్ వ్యాధి ఉంది. ఇందులో 40 మిలియన్ల మంది జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. సెల్ థెరపీ విధానం అమల్లోకి వస్తే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సినవారికి విముక్తి లభిస్తుంది. అంతేకాదు వారి మెడికల్ ఖర్చులు కూడా తగ్గుతాయని కీఫెర్ చెప్పారు.
25 ఏళ్లుగా డయాబెటీస్ రోగిపై పరీక్షలు
25 ఏళ్లుగా డయాబెటీస్ తో బాధపడుతున్న 59 ఏళ్ల ఓ రోగిపై సెల్ థెరపీ ప్రయోగం చేశారు వైద్యులు. ఈ థెరపీ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే రోగి 2017లో షుగర్ కారణంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. డయాబెటీస్ తగ్గని కారణంగా ఆయన ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. సెల్ థెరపీ ప్రారంభించిన 11 వారాల తర్వాత అతనికి ఇన్సులిన్ అవసరం లేకుండాపోయింది. మరో ఏడాది తర్వాత టాబ్లెట్స్ కూడా వేసుకోవడం ఆపేసాడు.
సెల్ థెరపీపై తొలి దశ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ తరహా విధానంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మలిదశ పరిశోధనలు విజయవంతమైతే ఈ చికిత్స విధానం అందుబాటులోకి రానుంది. అది కచ్చితంగా చక్కెర వ్యాధి ఉన్నవారికి తీపి కబురే.