తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కోసం రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నుంచి కవితను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే జగిత్యాల నుంచి పోటీ చేయాలని కవితను కోరుతానని తెలిపారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానం నుంచి కవిత పోటీ చేయబోరని వ్యాఖ్యానించారు. కవిత పోటీపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఎమ్మెల్యే సంజయ్ చెప్పారు. అయితే రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో కవిత నిలబెడతారా లేదా అనేది చర్చనీయాంశమైంది.