Top 6 News @ 6PM: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్.. కేంద్రానికి వ్యతిరేకంగా విజయ్ రిజల్యూషన్
1) 3 నెలల్లో నిందితుడికి కఠిన శిక్ష.. తిరుపతి ఘటనలో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత
తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో హత్యాచారానికి గురైన మూడేళ్ల చిన్నారి కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆ చిన్నారి ఇంటికి వెళ్లి బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి అనిత పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించారు. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. చిన్నారి మృతికి కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ప్రత్యేక కోర్టు ద్వారా 3 నెలల వ్యవధిలోనే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. అలానే బాధిత కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనిత తెలిపారు. ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం సరికాదని మంత్రి అనిత ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు.
2) ఏపీ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్
ఈ నెల 11వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవడంతోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. అందుకే ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది.
3) తెలంగాణకు వరంగల్ రెండో రాజధాని
వరంగల్ పట్టణాన్ని తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేంద్రం అనుమతిస్తే వరంగల్‌ని ఆనుకుని ఉన్న మామునూరు ఎయిర్ పోర్ట్ కూడా ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వరంగల్‌లో ఆదివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రకాళి ఆలయం చెరువును కబ్జా కోరల నుండి విడిపించి తాగునీటి జలాశయంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.భద్రకాళి చెరువు చుట్టూ సర్వే చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం అని స్పష్టంచేశారు.
4) రేవంత్ రెడ్డికి ఆ విషయం చెప్పే దమ్ముందా? కే లక్ష్మణ్ సవాల్
రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కారు విఫమైందని బీజేపి సీనియర్ నేత, ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. రైతులకు రుణాలు ఇచ్చే సమయంలో రేషన్ కార్డులకు లింకు పెట్టనప్పుడు ఇప్పుడు ఆ రుణాలు మాఫీ చేసేందుకు ఎందుకు లింకు పెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు. రైతు బంధు పెంచుతామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని గుర్తుచేశారు. బోనస్ ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా బోగస్ చేశారని కే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారో చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు.
5) కేంద్రానికి వ్యతిరేకంగా రిజల్యూషన్ పాస్ చేసిన విజయ్
ప్రముఖ సినీనటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ కేంద్రానికి వ్యతిరేకంగా పలు అంశాలపై తమ పార్టీ వైఖరిని చాటిచెప్పారు. నీట్ పరీక్ష, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లు తదితర అంశాలపై టీవీకే పార్టీ విబేధిస్తున్నట్లు విజయ్ స్పష్టంచేశారు. ఈ మేరకు పార్టీలో ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేశారు. తమిళనాడులో భారీ బహిరంగ సభ పెట్టిన వారం రోజులకు విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయాల్లో చర్చ మొదలైంది.
6) టెస్ట్ సిరీస్ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ
టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాజయం చెందడంపై రోహిత్ శర్మ స్పందించాడు. టెస్ట్ సిరీస్ ఓడిపోవడాన్ని తమ జట్టులో అందరి వైపు నుండి జరిగిన పొరపాటుగా రోహిత్ శర్మ అభివర్ణించాడు. ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడమైనా లేదా టెస్ట్ సిరీస్ ఓడిపోవడమైనా జీర్ణించుకునే విషయం కాదని అభిప్రాయపడ్డాడు. "మేమంతా పూర్తిస్థాయిలో ఆడలేదు. ఈ విషయాన్ని అంగీకరించి తీరాల్సిందే. న్యూజిలాండ్ ఆటగాళ్లు మాకంటే ఎంతో బాగా ఆడారు. మేము చాలా తప్పులు చేశాం. ఇది అంగీకరిస్తున్నా" అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ సెరెమనీ వద్ద మాట్లాడుతూ రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు.