ఆర్ధికం కోసం ఆంక్షలు సడలిస్తున్నారు.. కమ్ముకొస్తున్న ముప్పును మరచిపోతున్నారు!
కరోనా భయంతో ఇన్నాళ్లూ లాక్‌డౌన్ సంకెళ్లను విధించిన ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థలను గాడిన పెట్టే పనిలో పడ్డాయి. ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తూ కునారిల్లుతోన్న ఆర్థిక వ్యవస్థలకు జవసత్వాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్థిక దృష్టిలో ఇది మేలు చేసే విషయమే అయినా ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇప్పటికే కొన్నిదేశాల్లో అదుపులో ఉందనుకున్న కరోనా మళ్లీ విరుచుకుపడుతుండటమే ఇందుకు కారణం.
సుదీర్ఘ లాక్‌డౌన్‌తో వుహాన్‌లో అదుపులోకి వచ్చిన కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుతోంది. గత కొద్ది రోజులుగా వూహాన్‌లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం వూహాన్‌లోని కోటీ పదిలక్షల మంది జనాభాకూ పరీక్షలు చేయాలనే ఆలోచనకు వచ్చింది. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని అన్ని జిల్లాల అధికారుల్ని కోరింది.
కొవిడ్-19 దెబ్బకు 11 వారాలపాటు లాక్‌డౌన్‌లోనే ఉండిపోయిన వూహాన్‌లో ఏప్రిల్ 3 నాటికి కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంది. దాంతో ఏప్రిల్ 8 నుంచి వుహాన్‌లో ఆంక్షలు సడలించింది అక్కడి ప్రభుత్వం. 76 రోజుల తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనటంతో ఊపిరిపీల్చుకున్నారు. లాక్‌డౌన్ సడలించిన నెల రోజుల తర్వాత ఈ నెల 10న వుహాన్‌లో మళ్లీ ఒక పాజిటివ్ కేసు రావటం భయాందోళనలను కలిగిస్తోంది.
మళ్లీ కరోనా జడలు విప్పటంతో ముప్పును తప్పించుకునేందుకు అధికారులు కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా వూహాన్‌లోని అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్కరినీ పది రోజుల్లోపు పరీక్షించే ప్రణాళికను పంపాల్సిందిగా జిల్లాల అధికారులకు ఆదేశాలు అందాయి. పరీక్షల్లో వృద్ధులకు, ఎక్కువ జనసాంద్రత ఉండే ప్రాంతాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని అందులో పేర్కొన్నారు. అయితే, 11 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు అదీ పదిరోజుల్లో అంటే అసాధ్యమని చెబుతున్నారు సీనియర్ వైద్యాధికారులు.
ఒక్క వుహాన్‌లోనే కాదు.. లాక్‌డౌన్ సడలించిన మరికొన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దక్షిణ కొరియా,జర్మనీ, లెబనాన్, సింగపూర్‌లలో సెకండ్ వేవ్ ప్రారంభం కావటంతో అక్కడ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
దక్షిణ కొరియాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ప్రపంచదేశాలతో పోల్చుకుంటే కరోనా మహమ్మారిని నియంత్రించగలిగిన దక్షిణ కొరియాలో మళ్లీ 100 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈనెల 8 నుంచి 11 దాకా వరుసగా కేసులు వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నైట్ క్లబ్‌కి వెళ్లిన ఓ 29 ఏళ్ల వ్యక్తి కారణంగానే కేసులు నమోదయ్యాయని గుర్తించారు అధికారులు. అతడి నుంచే 24 మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. అదే నైట్ క్లబ్‌కు వెళ్లిన 19 వందల మందిని అధికారులు వెతుకుతున్న అధికారులు వారంతా 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
అటు జర్మనీలోనూ లాక్‌డౌన్ ఆంక్షలు సడలించాక కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈనెల 5వ తేదీ నుంచి అక్కడ రోజూ 5 వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. 6,7.8 తేదీల్లో రోజూ వెయ్యి మందికి పైగా జర్మన్లు వైరస్ బారిన పడ్డారు. వెయ్యి లోపే కేసులు నమోదైన లెబనాన్‌లో కూడా ఆంక్షలు సడలించాక మళ్లీ కొత్త కేసులు నమోదవడం ప్రారంభమైంది.
కరోనాను నియంత్రించేందుకు ముందస్తుగా చర్యలు తీసుకుని ఆదర్శంగా నిలిచిన సింగపూర్‌లో కూడా లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వటంతో కేసులు పెరిగాయి. గత వారం రోజులుగా సింగపూర్‌లో ప్రతీ రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు సింగపూర్‌లో 24 వేల కేసులు నమోదవగా 21 మంది చనిపోయారు. అయితే ఇంతకుముందు ఏప్రిల్ 7నుంచి మే-4వరకు కొన్ని పనిప్రదేశాలు, పాఠశాలలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చిన సింగపూర్ ప్రభుత్వం కేసులు పెరగటంతో జూన్ 1 వరకు విద్యాసంస్థలు, పరిశ్రమలు మూసేయాలని నిర్ణయించింది.
అటు జపాన్‌లో కూడా లాక్‌డౌన్ సడలింపులతో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. జపాన్‌లోని హొక్కైడో దీవుల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవటంతో అక్కడి అధికారులు ఫిబ్రవరిలో లాక్‌డౌన్ విధించారు. మార్చి మధ్యలో ఈ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ని తొలగించారు. అయితే లాక్‌డౌన్ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరిగిపోవటంతో అప్రమత్తమైన ప్రభుత్వం మరోసారి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన ప్రాంతాల్లో సెకండ్ వేవ్ కలకలం రేపటంతో నిపుణులు జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు. నిబంధనలు సడలిస్తున్న దేశాలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సడలింపులు కొత్త సవాళ్లను తీసుకొస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కొద్దిపాటి సడలింపులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు మూడుసార్లు లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి నాలుగో విడత లాక్‌డౌన్‌ను అమల్లోకి తేనుంది. ఇప్పటికే జోన్ల వారీగా కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఈ సారి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోన్న సమయంలో సడలింపులు ఇస్తే సడలింపుల విషయాన్ని పునరాలోచించాలని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అటు ఇటలీ, స్పెయిన్ దేశాలు కూడా ఆంక్షలను సడలించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితులు అదుపులో ఉండటంతో ప్రభుత్వాలు ఈ నిర్ణయానికి వచ్చాయి. అయితే అక్కడ జూన్ నుంచి ఆగస్టు లోపు వైరస్ మరోసారి విజృంభించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.