ఏం చేస్తుందిలే అనే అలసత్వం.. అవగాహనా లేమి..ఆ దేశాల పాలిట శాపం!

Update: 2020-04-13 09:28 GMT
Representational Image

కరోనా పట్ల అవగాహన లేకపోవడం ఒకటైతే.. ఈ వైరస్‌ ఏం చేస్తుందిలే.. అని తేలిగ్గా తీసుకోవడంతో కొన్ని దేశాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆ దేశాలపై వైరస్‌ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లో కరోనాను లైట్‌ తీసుకోవడంతో అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరోనాతో ఈ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి.

దక్షిణ కొరియాలో కరోనా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి కారణం పేషెంట్‌ 31. డేగు అనే పట్టణానికి చెందిన ఈ మహిళ కరోనా బారిన పడింది. ఆ సంగతి తెలియక ఓ చర్చిలో సమావేశాలకు హాజరైంది. ఆమె ద్వారా అక్కడున్నవారికి వైరస్‌ సోకి ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య వేల సంఖ్యకు చేరింది.

ఇరాన్‌లో తొలి కరోనా కేసు నమోదు కావటానికి నాలుగు రోజుల ముందు షియా మత పెద్దలందరినీ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ కలిశారు. అయితే భద్రతాధికారులు మత పెద్దలను ఖమేయి వద్దకు వెళ్లనివ్వలేదు. కానీ ఆ తర్వాత వారం రోజులకే కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో ప్రభుత్వం అనేక ప్రాంతాలలో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించింది. అయితే వీటిని మత పెద్దలు విమర్శిస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రజలు బేఖాతరు చేస్తూ రావటంతో ఇరాన్‌లో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

స్పెయిన్‌లో ఫిబ్రవరి మొదటివారం దాకా పెద్దగా కరోనా కేసులేమి నమోదు కాలేదు. మూడో వారంలో ఇటలీలోని మిలన్‌లో జరిగిన ఒక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు బెర్మాగో అనే పట్టణానికి చెందిన 2వేల500 మంది హాజరయ్యారు. వారే స్పెయిన్‌లో కరోనా వ్యాప్తికి కారణమయ్యారని తెలుస్తోంది. వీరు తిరిగి వచ్చిన తర్వాత స్పెయిన్‌లో కరోనా విపరీతంగా వ్యాపించింది.

అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. అమెరికాకు కరోనా వైరస్‌ ఐరోపా నుంచే వచ్చిందని జన్యుపరీక్షల ఆధారంగా అక్కడి శాస్త్రవేత్తలు తేల్చారు. కరోనా నేపథ్యంలో విదేశీయులను అనుమతించడం లాక్‌డౌన్‌ ప్రకటించకపోవటం వల్ల కూడా తీవ్రనష్టం జరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చైనా తర్వాత కరోనా వ్యాప్తి అధికంగా కనిపించింది ఇటలీలోనే. ఆ దేశంలో జనవరి 29న తొలి కేసు నమోదయింది. వెనువెంటనే ఆ దేశంలో ఆరు నెలల ఎమర్జెన్సీ ప్రకటించారు. అయితే కరోనా వ్యాప్తిని ఆ దేశ పౌరులు చాలా తేలికగా తీసుకున్నారు. దీంతో మార్చి మొదటి వారానికి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మార్చి చివరికి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.

Tags:    

Similar News