ఈయూ పార్లమెంట్ వీడియో కాన్ఫరెన్స్‌లో జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
ఈయూలో చేరకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరన్న జెలెన్ స్కీ
Volodymyr Zelenskyy: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంటును సభ్యదేశాలు అత్యవసరంగా సమావేశపరిచాయి. ఈ సమావేశానికి ఈయూ సభ్యదేశాలతో పాటుగా రష్యా యుద్ధంతో శక్తివంచన లేకుండా పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో జెలెన్‌స్కీ చేసిన ప్రసంగానికి ఈయూ దేశాలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాయి.
ఈయూ సభ్య దేశాలు తమకు మద్దతుగా నిలిచే దిశగా చర్యలు చేపట్టాలన్న డిమాండుతో జెలెన్‌స్కీ ఈయూ పార్లమెంటుకు వెళ్లారు. రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా జెలెన్ స్కీ స్పష్టం చేశారు. రష్యాకు తమ సత్తా ఏమిటో చూపుతామని ఆయన శపథం చేశారు. ఈ పోరాటంలో తప్పనిసరిగా విజయం సాధించి తీరతామని చెప్పారు.
రష్యా సేనలతో తమ దేశ పౌరులు ధైర్యంగా పోరాడుతున్నారని చెప్పారు. ఈ పోరాటంలో ఎంతదాకా అయినా వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. రష్యా బాంబు దాడుల్లో 16 మంది చిన్నారులు చనిపోయారని, తమ పిల్లలు క్షేమంగా జీవించాలన్నదే తమ కోరిక అని జెలెన్ స్కీ తెలిపారు. అసలు పుతిన్ లక్ష్యమేమిటని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ యుద్ధంలో ఈయూ సభ్య దేశాలు తమకు మద్దతుగా నిలబడతాయని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.
జెలెన్‌స్కీ చేసిన ప్రసంగాన్ని ఆసాంతం ఆసక్తిగా విన్న ఈయూ సభ్య దేశాల ప్రతినిధులు..ప్రసంగం ముగియగానే ఆయనకు లేచి నిలబడి మరీ చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు. ఈయూ దేశాలన్నీ ఉక్రెయిన్‌కు అండగా ఉంటాయని ఈయూ పార్లమెంటు అధ్యక్షురాలు ప్రకటించారు.