నాటోకు పుతిన్‌ జలక్.. నాటో దేశాల సరిహద్దుల్లోకి పుతిన్‌ బలగాలు..?

Vladimir Putin: పశ్చిమ దేశాల విధానాలే ఉక్రెయిన్‌ యుద్ధానికి పురికొల్పాయని పుతిన్‌ స్పష్టం...

Update: 2022-05-10 10:11 GMT
Vladimir Putin Sending His Forces into NATO Borders | Breaking News Today

నాటోకు పుతిన్‌ జలక్.. నాటో దేశాల సరిహద్దుల్లోకి పుతిన్‌ బలగాలు..?

  • whatsapp icon

Vladimir Putin: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు కారణం పశ్చిమ దేశాలే కారణం అంటున్నారు పుతిన్‌... నాటో తమ సరిహద్దుల్లోకి రావడం కాదు.. తామే నాటో సరిహద్దులోకి వెళ్తామని పుతిన్ చర్చలు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌ దక్షిణ ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మరియూపోల్‌, ఖేర్సన్‌ ప్రాంతాలను సొంతం చేసుకున్న రష్యా.. ఇప్పుడు ఒడెసా ప్రాంతంపై దృష్టి సారించింది. ఒకవైపు వేడుకులు జరుపుకుంటూ.. మరోవైపు ఒడెసా ప్రాంతంపై క్షిపణుల దాడులకు దిగింది. ఒకవేళ రష్యా... ఒడెసాను సొంతం చేసుకుంటే.. రుమేనియా సరిహద్దుకు పుతిన్‌ దళాలు చేరుకునే అవకాశం లభించనున్నది. అటు నల్ల సముద్రంపైనా పూర్తి పట్టు లభించనున్నది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య 75 రోజులకు చేరుకుంది. అయితే ఉక్రెయిన్‌పై దాడిని... రష్యా ఆక్రమణగా అమెరికాతో సమా పశ్చిమ దేశాలు అభివర్ణిస్తున్నాయి. పుతిన్‌ దురాక్రమణకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్నాయి. పుతిన్‌కు అడ్డుకట్ట వేయాలని కంకణం కట్టుకున్నాయి. అందులో భాగంగానే అమెరికా సహా పశ్చిమ దేశాలు.. రష్యాపై భారీ ఆంక్షలను విధించాయి. పుతిన్‌ దూకుడుకు బ్రేకులు వేసేందుకు... యుద్ధంలోకి నేరుగా దిగకుండా ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ, ఆర్థిక, మేధో సాయం చేస్తున్నాయి. దీంతో రెండ్రోజుల్లో ఉక్రెయిన్‌ తమ సొంతమవుతుందని భావించిన పుతిన్‌ను.. పశ్చిమ దేశాల సాయం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పశ్చిమ దేశాలపై పుతిన్‌ రగిలిపోయారు. ఆర్థికంగా రష్యాను దెబ్బ తీసేందుకు కఠిన ఆంక్షలను విధించిన దేశాలపై పుతిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంక్షలను విధించే దేశాలను శత్రు దేశాలుగా పరిగణిస్తామని హెచ్చరించారు. పలు దేశాలపై ప్రతీకార ఆంక్షలను పుతిన్‌ కూడా విధించారు.

ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరోసారి పుతిన్‌ సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్‌పై యుద్ధానికి పురికొల్పాయని స్పష్టం పుతిన్‌ చెబుతున్నారు. పరోక్షంగా ఐరోపా దేశాలకు నాటో సభ్యత్వం ప్రతిపాదనలే కారణమని పుతిన్‌ వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఐరోపాలోని ఫిన్లాండ్‌, స్వీడన్‌, ఉక్రెయిన్‌ నాటో సభ్యత్వం ఇవ్వాలని అమెరికా, ఐరోపా సమాఖ్యను కోరుతున్నాయి. ఒకవేళ ఈ మూడు దేశాలకు నాటో సభ్యత్వమిస్తే.. నాటో దళాలు నేరుగా రష్యా సరిహద్దులకు చేరుకుంటాయి. అంటే రష్యా సరిహద్దులోకి వచ్చి సైన్యాన్ని మోహరించి.. ఏ క్షణంలోనైనా మాస్కోపై దాడి చేసే అవకాశం అమెరికాకు లభించినట్టే. ఈ నేపథ్యంలోనే పుతిన్‌ ఈ మూడు దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. అంతేకాదు.. తూర్పు ఐరోపా నుంచి నాటో దళాలను వెనక్కి తీసుకోవాలని పుతిన్‌ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై అటు నాటో, ఇటు అమెరికా ఏమాత్రం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలోనే తాము ఉక్రెయిన్‌పై దాడికి దిగినట్టు పుతిన్‌ ఎంతో స్ఫష్టంగా వివరించారు.

రష్యా రాజధాని మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో విక్టరీ డే వేడుకలు జరుగుతుండగానే.. ఉక్రెయిన్‌పై దాడులను పుతిన్‌ సేన ముమ్మరం చేసింది. నల్ల సముద్రానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై పట్టు కోసం రష్యా యత్నిస్తోంది. ఉక్రెయిన్ ఆహార ధాన్యాలను ఎక్కువగా మాస్కో, ఒడెసా నుంచే ఎగుమతి చేస్తోంది. ఆహార ధాన్యాల ఎగుమతే ఉక్రెయిన్‌కు ప్రధాన ఆదాయ వనరు. నల్లసముద్ర తీర ప్రాంతంలోని ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతాన్ని సొంతం చేసుకుంటే.. నాటో సరిహద్దులకు రష్యా కూడా వెళ్లే అవకాశం లభించినట్టవుతోంది. నాటో సరిహద్దులోని బెలారస్‌తో సత్సంబంధాలు ఉన్నప్పటికీ.. పూర్తిగా ఆ దేశంపై ఆధారపకుండా.. తనే స్వయంగా నాటో సరిహద్దుల్లోకి చేరుకుని అమెరికాకు జలక్‌ ఇచ్చేలా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంపై హైపర్‌ సోనిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో రెండు హోటళ్లు ధ్వంసమైనట్టు ఉక్రెయిన్‌ అధికారులు ధ్రువీకరించారు. ఒకవేళ ఒడెసాను ఉక్రెయిన్ కోల్పోతే.. నల్లసముద్రంపై దాదాపుగా పట్టుకోల్పోయినట్టే అవుతుంది. అంటే.. ఉక్రెయిన్‌ పోర్టు నగరాలను కోల్పోతోంది. సముద్ర వాణిజ్యం పూర్తిగా నిలిచిపోనున్నది.

వరుస దాడులతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను రష్యా ఇప్పటికే ధ్వంసం చేసింది. మరియూపోల్‌, ఖేర్సన్‌ నగరాలను స్వాధీనం చేసుకుని.. క్రిమియాకు రోడ్డు మార్గానికి రష్యా లైన్‌ క్లియర్ చేసుకుంది. ఈ రెండు నగరాలతో పాటు బిల్‌హోరోడ్‌, ఇజ్మయిల్‌, ఒడెసా ప్రాంతాలను దక్కించుకునేందుకు రష్యా యత్నిస్తోంది. ఇవి దక్కితే నాటో కూటమి దేశమైన రొమేనియా సరిహద్దులోకి రష్యా దళాలు చేరుకుంటాయి. అంతేకాకుండా నల్ల సముద్రంపై రష్యాకు పూర్తిస్థాయిలో పట్టు లభించే అవకాశం ఉంది. ఈ పరిణామం నాటో కూటమికి ఇది ఎంతో ప్రమాదకర పరిణామమే..ఈ నేపథ్యంలో ఫిన్లాండ్‌, స్వీడన్‌తో పాటు ఉక్రెయిన్‌కు కూడా నాటో సభ్యత్వం ఇచ్చే దిశగా అమెరికా తదుపరి చర్చలు తీసుకునే అవకాశం ఉంది. ఇది రష్యా, నాటో దేశాల మధ్య మరింత ఉద్రక్త పరిస్థితులకు కారణమవుతుంది. క్రమంగా మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.

తాజాగా పోలండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ అండ్రీవ్‌కు నిరసన సెగ తగిలింది. వార్సాలోని సోవియట్‌ సైనిక శ్మశాన వాటికలో దివంగత రెడ్‌ ఆర్మీ సైనికులకు నివాళులర్పించకుండా అండ్రీవ్‌ను అడ్డుకున్నారు. ఆయనపై ఎర్రరంగు చల్లారు. ఉక్రెయిన్‌పై దాడికి నిరసన తెలిపారు. మరోవైపు రెండో ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకుల ప్రాణ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ష్కీ వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్‌ ప్రజలు విజయం సాధించారని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోనూ కచ్చితంగా నెగ్గుతామన్నారు. దీంతో రెండు విక్టరీ డేలను జరుపుకోవచ్చన్నారు. రష్యా పేరు ప్రస్తావించకుండా.. కొందరికి ఒక్క విక్టరీ డే కూడా ఉండబోదని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News