అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం. కొత్తగా జారీ చేసే వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్31 వరకూ హెచ్–1బీ, ఎల్–1, ఇతర తాత్కాలిక వీసాలపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. హెచ్ 1బీ రెన్యువల్స్‌కు ఢోకా లేదని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. హెచ్ 1బీ వీసాల జారీ విధానంలో సంస్కరణలకు ట్రంప్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మెరిట్ ఆధారంగానే హెచ్1బీ వీసాల జారీ చేయాలని, ప్రతిభావంతులకే అమెరికాలో ఎంట్రీకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత అమెరికాలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని.. ప్రస్తుతం పరిస్థితుల్లో విదేశాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటేనే స్థానికులకు ఉద్యోగాలు కల్పించగలుగుతామని ఆయన పేర్కొన్నారు.
అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలస ఉద్యోగులపై ప్రభావం పడనుంది. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని, అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకే ట్రంప్ హెచ్ 1బీ వీసాల జారీలో సంస్కరణలకు మొగ్గుచూపారని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. హెచ్ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి.. ఈ ఏడాది వీసాలు ఇచ్చే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.