రష్యాను చావుదెబ్బ కొట్టిన ఉక్రెయిన్‌.. ఒకే క్షిపణికి 400 మంది రష్యా సైనికులు హతం

Russia-Ukraine war: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం 11వ నెలలోకి ప్రవేశించింది.

Update: 2023-01-03 16:00 GMT

రష్యాను చావుదెబ్బ కొట్టిన ఉక్రెయిన్‌.. ఒకే క్షిపణికి 400 మంది రష్యా సైనికులు హతం

Russia-Ukraine war: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం 11వ నెలలోకి ప్రవేశించింది. రోజురోజు దాడులు ముమ్మరం అవుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా భీకర డ్రోన్‌ దాడులు చేస్తూ.. భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నది. తానేమీ తక్కువ తినలేదంటూ... ఉక్రెయిన్‌ ఎదురుదాడికి దిగుతున్నది. 11 నెలల యుద్ధంలో రష్యన్‌ సైన్యాన్ని తొలిసారి కీవ్‌ చావు దెబ్బ కొట్టింది. తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్‌స్క్‌లోని మకీవ్కా నగరంలో మాస్కో సైనిక శిబిరంపై కీవ్‌ విరుచుకుపడింది. హైమార్స్‌తో 400 మంది సైనికులను చంపేసింది. దాడి జరిగింది నిజమేనని క్రెమ్లిన్‌ అంగీకరించింది. 63 మంది సైనికులు చనిపోయినట్టు వెల్లడించింది. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి జాతిని ఉద్దేశించి.. పుతిన్‌ ప్రసంగించిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌ యుద్దంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాల్లో క్రమంగా.. ఉక్రెయిన్ పట్టు సాధిస్తోంది. ప్రధానంగా.. తూర్పులోని డాన్‌బాస్‌లో పోరు ఉధృతంగా సాగుతోంది. తాజాగా మకీవ్కా నగరంలో తిష్టవేసిన రష్యా సైన్యాన్ని ఒక్క దెబ్బతో ఉక్రెయిన్‌ మట్టి కరిపించింది. క్షిపణి దాడిలో 4 వందల మంది చనిపోయారని.. 300 మందిగాయపడ్డారని ఉక్రెయిన్‌ తెలిపింది. డొనెట్‌స్క్‌ ప్రాంతంలోని మకివ్కాలో ఓ స్కూల్‌లో రష్యా సైన్యం ఉందని తెలుసుకుని.. అమెరికాకు చెందిన హిమార్స్‌ రాకెట్లతో లక్ష్యంపై ఉక్రెయిన్‌ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. హిమార్స్‌ రాకెట్లు అత్యంత కచ్చితత్వంతో గురి చూసి ధ్వంసం చేయడంలో వాటికి తిరుగులేదు. వీటి సాయంతోనే కొంత కాలంగా రష్యా స్థావరాలపై ఉక్రెయిన్‌ విరుచుకుపడుతోంది. తాజా మకివ్కాలోని క్రెమ్లిన్‌ స్థావరంలో భారీగా మందుగుండు నిల్వ ఉంచినట్టు తెలుస్తోంది. కీవ్ దాడితో భారీ విస్పోటనం సంభవించినట్టు స్థానికులు వివరించారు. ఈ నేపథ్యంలోనే మాస్కో సేనలు భారీగా మృత్యువాత పడినట్టు సమాచారం. అయితే కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని... డిసెంబరు 31న రాత్రి జాతినుద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రసంగించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఉక్రెయిన్‌ దాడికి తెగబడింది. అయితే ఈ దాడిపై మాస్కో స్పందించింది. దాడి జరిగింది నిజమేని అంగీకరించింది. అయితే దాడిలో కేవలం 63 మంది సైనికులు మాత్రమే చనిపోయారని స్పష్టం చేసింది. 11 నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఒక్కరోజులో భారీగా ప్రాణాలు కోల్పోవడం భారీ పరిణామమేని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు రష్యా భూభాగంలోని క్లిమోవ్‌ జిల్లాలోని బ్రయాన్‌స్క్‌పై డ్రోన్‌ దాడి జరిగింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. అయితే విద్యుత్‌ స్టేషన్‌పై క్షిపణి దాడి జరిగింది. దీంతో బ్రయాన్‌స్క్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ దాడి ఉక్రెయిన్‌ చేసినట్టు రష్యా అధికారులు ధ్రువీకరించారు. ఇలా రష్యా భూభాగంలో ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు నిర్వహించడం ఇది మూడోసారి. వొరోనోజ్‌ నగరం దిశగా కీవ్‌ ప్రయోగించిన డ్రోన్‌ను ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ కూల్చేసినట్టు ప్రకటించింది. ఇవే కాకుండా.. డొనెట్‌స్క్‌ ప్రాంతంలో 2న మూడు గంటల్లో 14 సార్లు దాడులు జరిపినట్టు రష్యన్‌ దళాలు తెలిపాయి. డొనెట్‌స్క్‌లో ఒక్క రోజులో 4 వందల ఆయుధాలను ఉక్రెయిన్ ప్రయోగించినట్టు మాస్కో తెలిపింది. రష్యా సైనికుల జాడను ఉక్రెయిన్ ఎలా కనిపెట్టింది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రష్యా సైనికుల మొబైల్‌ సిగ్నళ్ల ఆధారంగానే కీవ్‌ డెడ్లీ అటాక్‌ చేసినట్టు తెలుస్తోంది. స్థానిక మొబైల్‌ టవర్ల నుంచి భారీగా సిగ్నల్స్‌ వస్తున్నట్టు కీవ్‌ సైన్యం గుర్తించింది. పక్కాగా లొకేషన్‌ను ట్రేస్‌ చేసింది. లక్ష్యాన్ని గుర్తించి.. శత్రు విధ్వంసకారక హైమార్స్‌ను రంగంలోకి దింపింది. రష్యా సైనికులు ధూమపానం చేయడంతో వెలువడిన పొగలతోనే వారిని గుర్తించి దాడి చేసినట్టు ఉక్రెయిన్‌ సైన్యం ఎద్దేవా చేసింది. మరోవైపు మకీవ్కా నగరంలో దాడి విషయమై రష్యాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా సైనికాధికారులను టార్గెట్‌ చేసుకుంటున్నారు. సైనికాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దాడి జరినట్టు రష్యన్‌ మీడియా ఆరోపించాయి. సైన్యం, మందుగుండు సామగ్రి ఒకేచోట పెట్టుకున్న కారణంగానే నష్టం భారీగా ఉన్నట్టు పేర్కొన్నది. భారీ సంఖ్యలో సైన్యం ఒకే చోట ఉండడాన్ని కూడా మాస్కో రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు.

మరోవైపు లుహాన్‌స్క్‌లో 50 కీవ్ ట్రూపులు మరణించినట్టు క్రెమ్లిన్‌ పేర్కొన్నది. లుహాన్‌స్క్‌లో కీలకమైన పీ66 జాతీయ రహదారి సమీపంలో కీవ్, మాస్కో దళాలు హోరాహోరీగా తలపడుతున్నట్టు బ్రిటన్‌ తెలిపింది. రష్యాలోని బెల్‌గోరోడ్‌ రీజియన్‌కు అత్యంత కీలకమైన మార్గం పీ66 హైవే... దీన్ని ఉక్రెయిన్‌ సొంతం చేసుకుంటే.. లుహాన్‌స్క్‌లోని క్రెమినాపై పట్టు సాధించినట్టు అవుతుంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా 2న డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఇదిలా ఉంటే.. 2న 41 డ్రోన్లను కీవ్‌పై మాస్కో ప్రయోగించినట్టు ఉక్రెయిన్‌ తెలిపింది. అన్నింటిని కూల్చేసినట్టు కీవ్‌ మేయర్‌ విటాలీ తెలిపారు. డ్రోన్ల దాడులతో ఇంధన మౌలిక వసతులు దెబ్బతిన్నట్టు కీవ్‌ వెల్లడించింది. తాజా దాడుల్లో ఇరాన్‌కు చెందిన సుసైడ్‌ డ్రోన్లు 39, రెండు రష్యాకు చెందిన ఓర్లాన్‌ డ్రోన్లతో పాటు ఎక్స్‌-59 క్షిపణిని ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్‌ వైమానిక దళం పేర్కొంది. ఇదిలా ఉంటే.. మకీవ్కా పూర్తిగా ఉక్రెయిన్‌ నియంత్రణలోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఏక కాలంలో లుహాన్స్‌, డొనెట్‌స్క్‌ ప్రాంతాల్లో కీవ్‌ బలగాలు దూసుకెళ్తున్నాయి. కొత్త సంవత్సరంలో మరింత దూకుడును ప్రదర్శిస్తున్నాయి. బాక్‌ముక్త్‌, మాకివ్కా ప్రాంతాల్లో 4 కిలోమీటర్ల మేర ఉక్రెయిన్‌ పట్టు సాధించింది. లుహాన్‌స్క్‌లోని అత్యంత కీలకమైన సెవిరోడోనెట్‌స్క్‌ ప్రాంతంలో రష్యా సైన్యాన్ని తరమి కొట్టింది. నిజానికి లుహాన్‌స్క్‌, డొనెట్‌స్క్‌ ప్రాంతాలు పూర్తిగా రష్యా స్వాధీనంలో లేవు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రష్యా సైన్యం తమ నియంత్రణలోకి తెచ్చుకున్నది. ఇక జపోరిజ్జియా రీయిజియన్‌ది కూడా అదే పరిస్థితి. జపోరిజ్జియా నగరం ఇప్పటికీ రష్యాకు సొంతం కాలేదు. ఇక ఖేర్సన్‌ నుంచి పూర్తిగా మాస్కో సైన్యం తప్పుకున్నది. కానీ నాలుగు రీజియన్లు తమవే అని రెఫరెండం ద్వారా మాస్కో చెబుతోంది.

మరోవైపు ఉక్రెయిన్‌కు మరో దఫా భారీ సాయం అందించేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధమవుతోంది. 19 వందల కోట్ల డాలర్ల ప్యాకేజీని విడదల వారీగా కీవ్‌కు అందించనున్నది. యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌డేర్ లియెన్‌... తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఫోన్‌ కాల్‌ చేశారు. హృదయపూర్వకంగా ఉక్రెయిన్‌కు తాము మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. తాజాగా మరోసారి జెలెన్‌స్కీతో యూరోపియన్‌ యూనియన్‌ నాయకులు సమావేశం కానున్నారు. సాయం విషయం చర్చించనున్నారు. జనవరి నుంచి ప్రారంభమయ్యే ఈ సాయాన్ని అందించాలని ఈయూను జెలెన్‌స్కీ కోరారు. సాయంలో భాగంగా ఎల్‌ఈడీ బల్బులు, స్కూల్‌ బస్సులు, జనరేటర్లు, ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్లు రానున్నట్టు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సాయం విషయంలో పోలాండ్‌, హంగేరి అభ్యంతరం తెలిపాయి. అయితే ఈ రెండు దేశాలు తమకున్న వీటో అధికారంతో 19వందల కోట్ల డాలర్ల ప్యాకేజీని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే.. ఈయూ సభ్యదేశాల ఒత్తిడితో సైలెంట్‌ అయ్యాయి. తమలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని యూరోపియన్ కమిషన్‌ తేల్చి చెప్పింది. మరోవైపు 2022లో ఒప్పందం ప్రకారం రష్యా నుంచి 90 శాతం చమురు దిగుమతులను రద్దు చేసుకున్నట్టు ఈయూ తెలిపింది. 2023లో కొత్త ఒప్పందాలను చేసుకోలేదు. ఈ మరోవైపు చమురు, సహజ వాయువుల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ఐరోపా దేశాలు దృష్టి సారించాయి. ఇప్పటికే భారీగా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేశాయి. శీతాకాలంలో చమురు సమస్యలను అతి కష్టం మీద గట్టెక్కుతున్నాయి. ఆ తరువాత.. పరిస్థితి ఏమిటన్నది ఈయూ వెల్లడించడ లేదు.

కొత్త సంవత్సరంలో యుద్ధం మరింత ఘోరంగా మారుతోంది. ఇరు దేశాలు భీకరంగా దాడులకు దిగుతున్నాయి. చర్చలకు ప్రతిపాదనలు వస్తున్నా.. ఆ దిశగా ఎవరూ చొరవ చూపడం లేదు. దీంతో యుద్ధం ఇంకెన్నాళ్లు కొనసాగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News