మూడు రాజధానులు.. ఇదీ దక్షిణాఫ్రికా కథ!

Update: 2019-12-18 09:23 GMT

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణాఫ్రికా మూడు రాజధానుల గురించి కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మూడు రాజధానుల గురించి చూద్దాం.

దక్షిణాఫ్రికా దేశానికి ఒకటి కాదు రెండు కాదు మూడు రాజధానులు ఉన్నాయి. అలా మూడు రాజధానులు ఉండడం వెనుక ఆర్థిక, చారిత్రక, సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. అక్కడ శాసన విభాగం కేప్ టౌన్ లో కొలువుదీరింది. న్యాయ వ్యవస్థ బ్లూం ఫౌంటేన్ లో ఉంది. ఇక కార్యనిర్వాహక వ్యవస్థ ప్రిటోరియా నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ జాతుల ప్రజల కోరిక మేరకు ఇలా మూడు రాజధానులను కొనసాగిస్తున్నారు. ఇందుకు మరెన్నో కారణాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాగా ఉన్న దేశం ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండింది. ఒక వైపున బ్రిటిష్ వారు, మరో వైపున డచ్, జర్మనీ లకు చెందిన సెటిలర్లు ఆ రాజ్యాలను పాలించే వారు. డచ్, జర్మనీలకు చెందిన వారి పాలనలో ఉన్న రాజ్యాలను బోయెర్ రిపబ్లిక్ లుగా వ్యవహరించే వారు. బ్రిటిష్ వారికి ఇతర చిన్న రాజ్యాలతో యుద్ధాలు జరిగాయి. యుద్ధంలో గెలిచిన బ్రిటిష్, ఓడిపోయిన బోయెర్ రిపబ్లిక్ ల మధ్య చర్చలతో యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏర్పడింది. బ్రిటిష్ కేప్ ప్రావిన్స్ కు కేప్ టౌన్ కు రాజధానిగా ఉండింది. బోయెర్ రిపబ్లిక్ ఆఫ్ ట్రాన్స్ వాల్ కు ప్రిటోరియా రాజధానిగా ఉండింది. ఆరెంజ్ ఫ్రీ స్టేట్ అనే మరో బోయెర్ రిపబ్లిక్ కు బ్లూమ్ ఫౌంటెన్ రాజధానిగా ఉండింది. యుద్ధానంతర చర్చల నేపథ్యంలో ఈ మూడు నగరాలనూ రాజధానులుగా కొనసాగిస్తూ వచ్చారు.

1994లో దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి పాలన ముగిసి ప్రజాస్వామ్యం దిశగా పయనం మొదలైంది. ప్రిటోరియానే అన్నిటికీ రాజధాని చేయాలని కొందరు అంటే జాత్యంహంకారానికి ప్రతిబింబంగా ఉండే ప్రిటోరియా బదులుగా కొత్త రాజధాని నిర్మించుకుందామని మరి కొందరు అన్నారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కూడా కొత్త నగరానికే ప్రాధాన్యం ఇచ్చింది. కాకపోతే కొత్త నగరం అంటే ఖర్చు అధికమనే భావనతో ఆ ప్రతిపాదనను వదిలేశారు. మరో వైపున మూడు విభిన్న తెగల వాళ్ళు అప్పటి వరకూ రాజధానులుగా కొనసాగిన తమ నగరాలు అదే హోదాలో కొనసాగాలని డిమాండ్ చేశారు. ఒక్కో చోట ఒక్కో పార్టీ అధికారంలో ఉండడంతో మూడు రాజధానుల వాదన కొనసాగింది.

ఇదీ దక్షిణాఫ్రికా మూడు రాజధానుల కథ. మూడు రాజధానులు ఉన్నా వచ్చే ఇబ్బందేమీ లేదనే వారు కూడా ఉన్నారు. సాంకేతికత పెరిగిన నేపథ్యంలో మూడు రాజధానుల నుంచి కూడా కార్యకలాపాలు కొనసాగించడం సులభమన్న వాదన వస్తోంది. తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా సాంకేతికత నేపథ్యంలో మూడు రాజధానుల ముచ్చట వినిపిస్తోంది. 

Tags:    

Similar News