Oil Output: సౌదీ కొట్టిన దెబ్బకు బైడెన్ మైండ్ బ్లాంక్..
Oil Output: అగ్రరాజ్యం అమెరికాకు సౌదీ షాకిచ్చింది.
Oil Output: అగ్రరాజ్యం అమెరికాకు సౌదీ షాకిచ్చింది. తమకు సాయం చేయమని అడిగితే సాకులు చెప్పిన బైడెన్‌కు సౌదీ కంట్రీస్ ఊహించని షాకిచ్చాయి. అమెరికాకు పెట్రోల్ ఉత్పత్తిని సగానికి సగం తగ్గిస్తూ సౌదీ నిర్ణయం తీసుకోవడంతో బైడెన్ గొంతులో పచ్చి వెలక్కాయి పడినట్లైయింది. ఇంతకీ సౌదీ అమెరికాను ఏం సాయం కోరింది అందుకు బైడెన్ ఎందుకు నో చెప్పారు.
బండ్లు ఓడలు...ఓడలు బండ్లవుతాయింటే సరిగ్గా ఇదేనేమో. కొన్ని నెలల క్రితం వరకూ హుతి రెబల్స్ తమపై దాడి చేస్తున్నారు ఆయుధాలు ఇవ్వాలని అగ్రరాజ్యం అమెరికాను సౌదీ కోరింది. కానీ అమెరికా ఏవో కుంటిసాకులు చెప్పి ఆయుధాల విక్రయం నిలిపివేసింది. కానీ కాలం మారింది. చమురు సంక్షోభం భగ్గుమంది. దీంతో ఇంధన ఉత్పత్తి పెంచాలని అమెరికా సౌదీని కోరింది. దీనికి అంగీకరించిన సౌదీ దాదాపు 40 ఏళ్ల అతి తక్కువ పెంపుకు ఓకే చేస్తూ అమెరికాకు షాకిచ్చింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభానికి దారి తీసింది. దీంతో అమెరికాలో ద్రవ్యోల్భణం పతాక స్థాయిలో 9శాతాన్ని దాటేసింది. అయితే మరికొన్నాళ్లలో అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు ఉండడంతో బైడెన్ సర్కారులో టెన్షన్ మొదలైంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ఉత్పత్తి పెంచడం దాని లక్ష్యంగా మారింది. కానీ రష్యా బైడెన్ మాట వినదు. ఇక కొద్దో గొప్పో సౌదీనే. ఈ నేపథ్యంలో ఇటీవల సౌదీ పర్యటనకు వెళ్లిన బైడెన్ చమురు ఉత్పత్తి పెంచడంపై అక్కడి యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయి చర్చించారు. అప్పటి వరకు మహమ్మద్ బిన్ సల్మాన్ పాలనలోని సౌదీని బైడెన్ కార్యవర్గం దూరం పెట్టింది. కానీ చమురు కోసం ఒక్కసారిగా దగ్గరయ్యేందుకు చేసిన పెద్దగా ఫలించలేదు. సౌదీ నేతృత్వంలోని ఒపెక్ బృందం కేవలం రోజుకు లక్ష పీపాల చమురు ఉత్పత్తి మాత్రమే పెంచాలని నిర్ణయించింది. ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో ఇది కేవలం 86 సెకన్ల డిమాండ్‌ను మాత్రమే తీర్చగలదు.
సౌదీ తీసుకున్న ఈ నిర్ణయం బైడెన్ వర్గానికి పెద్ద షాకిచ్చింది. అమెరికాలోనే 2021 లెక్కల ప్రకారం రోజువారీ చమురు వినియోగం 19.78 మిలియన్ పీపాలుగా ఉందంటే తాజా పెంపు ఎంత తక్కువో అర్థం చేసుకోవచ్చు.1986 నుంచి అతి తక్కువ చమురు ఉత్పత్తి పెంపుగా ఇది నిలిచింది. వాస్తవానికి జులై, ఆగస్టు నెలల్లో రోజుకు 6,48,000 పీపాల చమురు ఉత్పత్తి పెంచుతామని జూన్‌లో ఒపెక్ స్పష్టం చేసింది. కానీ తాజా పెంపు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అమెరికాలోని వైట్‌హౌస్ తెలిపింది. ఒపెక్ నిర్ణయాన్ని అమెరికా పత్రికలు బైడెన్ ఫెయిల్యూర్‌గా అభివర్ణించాయి. బైడెన్ కార్యవర్గానికి ఇదో చెంపపెట్టు అని సీఎన్‌ఎన్ సహా న్యూయార్క్ టైమ్స్ లాంటి పలు పత్రికలు విమర్శలు గుప్పించాయి.
అయితే సౌదీ ఇచ్చిన షాక్‌తో తేరుకున్న అమెరికా పలు దిద్దుబాటు చర్యలను తీసుకుంది. ఒపెక్ దేశాల సమావేశానికి కొద్ది గంటల ముందే బైడెన్ కార్యవకర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు కొన్ని నెలల నుంచి నిలిపివేసిన ఆయుధ విక్రయాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ ప్రకారం 5 బిలియన్ డాలర్ల విలువైన క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇతర పరికరాలు ఉన్నాయి. సౌదీలోని కీలక స్థావరాలను హుతి రాకెట్ల నుంచి కాపాడేందుకు వీలుగా 3 బిలియన్ డాలర్ల విలువైన పేట్రియాట్ క్షిపణులు, UAEకి 2.2 బిలియన్ డాలర్ల విలువైన హైఆల్టిట్యూడ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను అందజేయనుంది. అత్యాధునిక థాడ్ గగనతల రక్షణ వ్యవస్థను సైతం విక్రయించనుంది. అమెరికా విదేశాంగ విధాన లక్ష్యాలను సాధించడానికి మిత్ర దేశానికి రక్షణ కల్పించడం ద్వారా అమెరికా భద్రతను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని శ్వేధసౌదం ప్రకటించింది. ఈ విక్రయాలు గల్ఫ్‌లో రాజకీయ స్థిరత్వాన్ని, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది.
వాస్తవానికి సౌదీ అరేబియా చమురును అగ్రదేశాలపై ఆయుధంగా వాడడం ఇదేమీ కొత్తకాదు. 2020లో సౌదీ-రష్యా మధ్య చమురు ధరలపై విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి సౌదీ భారీ డిస్కౌంట్‌పై చమురును అమ్మడం మొదలు పెట్టింది. ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచింది. దీంతో గల్ఫ్ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంతగా ధరలు పతనం అయ్యాయి. ఒక దశలో చమురు ధరలు నెగిటీవ్ స్థాయిలో పడిపోయాయి. దీనికి కోవిడ్ తోడు కావడంతో డిమాండ్ పతనం తోడైంది. రష్యా రూబుల్ ఈ దెబ్బకు భారీగా విలువను కోల్పోయింది. ఆ తర్వాత ఒపెక్ జోక్యంతో మళ్లీ ఇరు దేశాలు రాజీకి వచ్చి చమురు ఉత్పత్తిలో కోతలు విధించాయి.
మొత్తానికి అగ్రరాజ్యం అమెరికాకు సౌదీ షాక్ ఇవ్వడం సరికొత్త పరిణామాలకు దారితీసింది. సౌదీ కొట్టిన దెబ్బకు బైడెన్ మైండ్ బ్లాంక్ అయింది. మరోసారి అలాంటి తప్పు చేయకూడదన్న ఆలోచనలో బైడన్ ఉన్నారని వైట్‌హౌస్ వర్గాలు చెప్తున్నాయి. పొరుగు దేశం సాయం అడిగినప్పుడు కాదంటే ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనేది బైడెన్‌కు బాగా తెలిసొచ్చింది.