Russia-Ukraine: ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు

Russia-Ukraine: బెలారస్ చేరుకున్న ఇరుదేశాల ప్రతినిధులు

Update: 2022-02-28 11:54 GMT

ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత చర్చలకు ఇరుదేశాలు ఒప్పుకున్నాయి. ఇందులో భాగంగా బెలారస్‌ సరిహద్దు ప్రాంతమైన గోమెల్‌ నగరంలో చర్చలకు వేదిక సిద్ధమైంది. ఇప్పటికే రష్యాకు చెందిన విదేశీ, రక్షణ మంత్రిత్వశాఖతోపాటు అధ్యక్ష కార్యాలయ అధికారులు ఈ ఉదయమే అక్కడకు చేరుకున్నారు. మరోవైపు రష్యాతో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్‌ బృందం కూడా గోమెల్‌ చేరుకున్నట్లు సమాచారం. కాసేపట్లో చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని రష్యా భావిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇక చర్చలకు సంబంధించి తొలుత రష్యా చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. బెలారస్‌ సరిహద్దు ప్రాంతంలో చర్చించేందుకు అంగీకరించారు. ఈ విషయంపై బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. అయితే, ఎటువంటి ముందస్తు షరతులు లేనప్పటికీ చర్చలకు బయలుదేరడం మొదలు, చర్చలు జరిగే సమయం, తిరిగి వచ్చే వరకూ బెలారస్‌లోని అన్ని రకాల విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణలు ఎగరకుండా చూసే బాధ్యతను బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు తొలి అడుగు పడినట్లు అయ్యింది.

ఇదిలా ఉంటే, ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు జరుపుతామని రష్యా చెబుతున్న సమయంలోనే అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ విషయంలో పుతిన్‌ తీరును నాటో దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవే కాకుండా అత్యంత ప్రమాదకరమైనవిగా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా దూకుడును కట్టడి చేసేందుకు పలు రకాల ఆంక్షలను అమలు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.

విద్యార్ధుల తరలింపునకు నేరుగా కేంద్రమంత్రులే రంగంలోకి దిగారు. కేంద్రమంత్రులు ఉక్రెయిన్‌కు పయణమవుతున్నారు. రొమేనియాకు జ్యోతిరాదిత్య సింథియా, స్లోవేకియాకు కిరణ్‌ రిజిజు, హంగేరికి హరిదీప్‌సింగ్ పూరి, పోలాండ్‌కు జనరల్ వీకేసింగ్ వెళ్లనున్నారు.

Tags:    

Similar News